డాన్‌లు అవుదామని.. దొరికిపోయారు | four youth dreaming to be dons arrested with pistol | Sakshi
Sakshi News home page

డాన్‌లు అవుదామని.. దొరికిపోయారు

Published Sat, May 9 2015 4:56 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

డాన్‌లు అవుదామని.. దొరికిపోయారు

డాన్‌లు అవుదామని.. దొరికిపోయారు

ఆ నలుగురు యువకులు విద్యావంతులు. వారిలో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడగా మరో ఇద్దరు చదువుకుంటున్నారు. అనుకోకుండా వారికి ఇటీవల ఒక పిస్తోల్ దొరికింది. దాని ఆధారంగా  రాత్రికి రాత్రే ధనవంతులు కావాలని కలలుగన్నారు. ఇందుకు హత్య, దోపిడీలు, స్నాచింగ్‌లు చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఓ వ్యక్తిని హత్య చేసేందుకు వారు పన్నిన కుట్రను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) గుట్టు రట్టు చేసింది. నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి పిస్తోల్, కత్తి, కారును స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌కు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

పూర్తి వివరాలను ఎస్‌ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రవికిరణ్ అలియాస్ రవి (21), కుషాయిగూడకు చెందిన ఉప్పరాజి భరత్‌కుమార్ (22),  పిన్‌రెడ్డి ప్రసాద్‌రెడ్డి (22), నేరేడ్‌మెట్‌కు చెందిన పులపల్లి భగీరథ్ (21), నలుగురూ స్నేహితులు. వీరిలో టోల్‌గేట్ వద్ద పనిచేస్తున్న రవికి రెండు నెలల క్రితం బీహార్‌కు చెందిన అజయ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను ఒకసారి మాటల మధ్యలో బీహార్‌లో తుపాకులు సులభంగా దొరుకుతాయని రవికి చెప్పాడు. దీంతో తనకు పిస్తోల్ కావాలని కోరడంతో రూ.1.60 లక్షలకు ఇప్పిస్తానని అజయ్ హామీ ఇచ్చాడు. ఇందుకుగాను రవి రూ.1.30 లక్షలు చెల్లించడంతో అతను నెల రోజుల క్రితం బీహార్ నుంచి పిస్తోల్‌ను తెచ్చి రవికి ఇచ్చాడు. పిస్తోల్ విషయాన్ని అతను తన స్నేహితులైన భరత్‌కుమార్, ప్రసాద్‌రెడ్డి, భగీరథ్‌లకు చెప్పడంతో అందరూ కలిసి దాని సహాయంతో దోపిడీలు, హత్యలు, స్నాచింగ్‌లు చేసి సులువుగా డబ్బు  సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా ముందుగా తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ భర్తను హత్య చేయాలని ప్రసాద్‌రెడ్డి పథకం పన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నలుగురు కారులో వెళ్తుండగా సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్లు  ఉమేందర్, పుష్పన్‌కుమార్, ఎస్‌ఐలు రాములు, ఆంజనేయులు వారిని అడ్డుకుని పిస్తోల్‌తో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అజయ్ గురించి ఆరా తీయగా అతడు బుల్లెట్లు తెచ్చేందుకు బీహార్‌కు వెళ్లినట్లు విచారణలో తేలడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అజయ్‌ను అదుపులోకి తీసుకుంటే ఇంకెవరికైనా తుపాకులను విక్రయించిందీ తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement