నకిలీ అద్దె బిల్లుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా?
న్యూడిల్లీ: నకిలీ అద్దె రసీదులు చూపించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి మమ అనిపించేస్తున్నారా? అయితే ఇక మీదట ఇలా చేయడం కుదరదు. పన్ను చెల్లింపుదారులకు ఝలక్ ఇచ్చేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు నకిలీ అద్దె బిల్లుల ద్వారా హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పొందే అవకాశం ఇక మీదట సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. పన్ను ఎగవేతదారులపై కొరడా ఝళిపిస్తున్న ఆదాయ పన్నుశాఖ మరో సంచలన నిర్ణయ తీసుకోనుందట. పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు ఇప్పటివరకు బాగా ప్రాచుర్యంలో వున్న ఈ పద్ధతి భవిష్యత్తులో ఉండదని ఆదాయ పన్ను శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఐటీ అధికారి అందించిన సమాచారం ప్రకారం నకిలీ ఇంటి అద్దె పత్రాలు చూపించి టాక్స్ రిటర్న్ ఫైల్ చేసే చెల్లింపుదారులకు చెక్ పెట్టేలా నిబంధనలను ఆదాయ పన్నుశాఖ కఠినతరం చేయనుంది. ఈక్రమంలో పన్ను దాఖలు సమయంలో ఎసెస్సింగ్ అధికారి ప్రూఫ్ చూపించమని అడిగే అవకాశం ఉంది. అద్దెకు ఉంటున్న వివరాలు, రెంటల్ అగ్రిమెంట్, ఎలక్ట్రిసిటీ, వాటర్‌బిల్లు లాంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగులు సమర్పించే ఐటీఆర్ ఫాంలో వివరాలు క్రాస్ చెక్ చేయనున్నారని ఐటీ అధికారి తెలిపారు.
మరోవైపు లక్ష రూపాయలు అద్దె కడుతున్నట్టుగా లెక్కల్లో చూపిస్తున్న వారు, ఇంటి యజమాని పాన్ కార్డు వివరాలు సమర్పించడం తప్పని అన్న సంగతి తెలిసిందే.