ఇప్పుడు పసిడి పరుగే..!
అమెరికా ఎన్నికలు, భారత్‌లో పండుగల సీజన్‌తో బంగారం వెలుగు
న్యూయార్క్: సమీప కాలంలో పసిడి హవా కొనసాగుతుందన్న స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనిశ్చిత పరిస్థితి.. ఇన్వెస్టర్లను పసిడివైపు మళ్లేలా చేస్తోంది. ఇక భారత్‌లో పెళ్లిళ్లు, పండుగల సీజన్ పసిడికి బలంగా మారుతోంది. ప్రత్యేకించి అమెరికా ఎన్నికల వాతావరణం చూస్తే... రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ గెలిస్తే... పసిడి ఔన్‌స (31.1గ్రా)కు 1,800 డాలర్లకు చేరుతుందన్న వాదన వినిపిస్తోంది. డెమోక్రాట్ హిల్లరీ గెలిచినా 1,600 డాలర్లు ఖాయమన్న విశ్లేషణలున్నాయి.
వీరి ఇరువురి విధానాలూ పసిడి పెరుగుదలకు దోహదం చేసేవిగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా పసిడికి సమీప కాలంలో సానుకూలత అధికంగానే ఉంది. ఇక ఫెడ్ ఫండ్ రేటు పెంచితే పసిడి పరిస్థితి ఏమిటన్న ప్రశ్నా ఉంది. అరుుతే తొలి విడత ఫండ్ రేటు పెంచినప్పుడు అందరి అంచనాలకు భిన్నంగా పసిడి 1,370 డాలర్ల దిశగా దూసుకు పోరుున విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.50 శాతం) పెరిగినా పసిడి మెరుపులకు ఇబ్బంది ఏదీ ఉండబోదన్నది నిపుణుల వాదన.
ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా సమసిపోలేదని, ఇది పెట్టుబడులు ఈ మెటల్‌లోకి వెళ్లడానికి దోహదంచేసే అంశమని నిపుణులు భావిస్తున్నారు. కేవలం పెట్టుబడిదారులే కాకుండా చైనా వంటి దేశాలు సైతం పసిడి కొనుగోళ్లకు తిరిగి మెగ్గుచూపి, నిల్వలు పెంచుకునే అవకాశం ఉందనీ, ఈ అంశం సైతం పసిడిపై సమీప కాలంలో ప్రభావం చూపుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద సమీపకాలంలో ఆయా ఫలితాలన్నీ పసిడిపై ప్రభావం చూపుతారుు.
వరుసగా మూడవ వారం కూడా పెరుగుదలే!
పసిడి అటు అంతర్జాతీయ, ఇటు దేశీ మార్కెట్లో వరుసగా మూడవ వారమూ లాభపడింది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ ధర ఔన్‌సకు వారం వారీగా గత శుక్రవారంనాటికి దాదాపు 30 డాలర్లు పెరిగి 1,304కు చేరింది. ఇక వెండి ధర కూడా లాభాలతో 18 డాలర్లపైకి ఎగసింది. దేశీయంగానూ ఇదే పరిస్థితి కనిపించింది. ముంబై స్పాట్ మార్కెట్‌లో శుక్రవారంతో ముగిసిన వారంలో... వారం వారీగా 10 గ్రాముల 99.9 స్వచ్ఛత పసిడి ధర రూ.665 ఎగసి (2.22 శాతం) రూ.30,810కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో ఎగసి రూ.30,660కి చేరింది. వెండి కేజీ ధర రూ.935 పెరిగి రూ.44,035కు ఎగసింది.