జయప్రదకు కేబినెట్ ర్యాంక్ పదవి
లక్నో: సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఉత్తరప్రదేశ్ లో కేబినెట్ ర్యాంక్ పదవి లభించింది. యూపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ సీనియర్ డిప్యూటీ చైర్పర్సన్గా జయప్రదను నియమించారు. పార్టీలో తనకు, సన్నిహితురాలు జయప్రదకు అవమానం జరుగుతోందని, పార్టీ నుంచి వైదొలుగుతామని సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ హెచ్చరించిన కొన్ని రోజులకే ఆమెకు పదవి రావడం గమనార్హం.
యూపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా ఇటీవల కవి గోపాల్ దాస్ నీరజ్ను నియమించారు. తాజాగా జయప్రదను డిప్యూటీ చైర్పర్సన్గా నియమిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్ హోదా కల్పించారు. జయప్రద గతంలో యూపీలోని రాంపూర్ నుంచి ఎస్పీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా 2010లో అమర్ సింగ్తో పాటు ఆమె పార్టీ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. తర్వాత మళ్లీ ఎస్పీ గూటికి చేరారు.