జాగిర్దారీ భూములన్నీ సర్కారువే: మంత్రి హరీశ్
- స్కాం జరగలేదు.. ఆడిట్‌లో అక్రమాలు బయటపడ్డాయన్న మంత్రి
హైదరాబాద్: తెలంగాణలో ఉన్న జాగిర్దారీ భూములన్నీ ఇంచులతో సహా ప్రభుత్వ భూములేనని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మియాపూర్ సహా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కడా భూ కుంభకోణం జరగలేదని, ఒక్క గజం భూమి కూడా కబ్జాకు గురికాలేదని, ఖజానాకు నయాపైసా నష్టం వాటిల్లలేదని వివరించారు. గురువారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. భూముల విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
‘ఇదేదో కుంభకోణం అని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ నిజమేమిటంటే ఆడిట్ నివేదికలోనే అక్రమాలు బయటపడ్డాయి. అడ్డగోలు వ్యవహారం సాగుతోందని తెలిసిన వెంటనే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గతంలో ఎంత పెద్ద కుంభకోణౠలు జరిగినా, వాటిపై నివేదికలు వచ్చినా నాటి పాలకులు పట్టించుకున్న సందర్భాలు లేనేలేవు. గత ప్రభుత్వాలు చేసిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం వల్లే భూములు కబ్జాలకు గురయ్యాయి’ అని హరీశ్ రావు అన్నారు.