ధ్వంసమైన కాల్ ట్యాక్సీ (ఇన్సెట్) ఎమ్మెల్యే అస్లాం బాషా
తమిళనాడులోని మనిదనేయ మక్కల్ కట్చి (ఎంఎంకే)కి చెందిన ఎమ్మెల్యే అస్లం బాషాపై హత్యాయత్నం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద విచారణ జరుపుతున్నారు. ద్రావిడ తమిళర్ ఇయక్క పేరవై ఆధ్వర్యంలో తాంబరం షణ్ముగం రోడ్డులో శుక్రవారం సాయింత్రం బహిరంగ సభ జరిగింది. ఇందులో శుభ వీరపాండియన్, మనిదనేయ మక్కల్ కట్చికి చెందిన ఆంబూర్ ఎమ్మెల్యే అస్లం బాషా, జిల్లా డీఎంకే కార్యదర్శి టీఎం అన్బరసన్ పాల్గొన్నారు. సభ ముగియగానే అస్లం బాషా కారులో బయలుదేరి వెళ్లారు. కారు వెనుక ఆయన పార్టీకి చెందిన ఇమ్రాన్, ఖుదా ఆయన భద్రత కోసం బైకులో వెళ్లారు.
జీఎస్‌టీ రోడ్డు, కడపేరి సమీపంలోగల పెట్రోలు బంకులో పెట్రోలు పట్టుకునేందుకు కారును నిలిపారు. ఆ సమయంలో పెట్రోల్ నింపుకునేందుకు వచ్చిన ఒక కాల్ ట్యాక్సీ బైక్‌ను ఢీకొనే విధంగా వచ్చి ఆగింది. దీంతో ఇమ్రాన్, ఖుదా వారిని నిలదీశారు. వెంటనే ట్యాక్సీలో నుంచి దిగిన నలుగురు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. వెంటనే అస్లం బాషా కారు దిగి వచ్చి వారిని ప్రశ్నించడంతో వారి మధ్య ఘర్షణకు దారితీసింది. ఆగ్రహించిన వారు కత్తులతో అస్లంబాషాపై దాడికి ప్రయత్నించారు. ఈ విషయం ఎంఎంకే కార్యకర్తలకు తెలియడంతో వారు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఎమ్మెల్యేను రక్షించి కారులో పంపివేశారు. తర్వాత దాడికి పాల్పడ్డ నలుగురిని పట్టుకునేందుకు వారు ప్రయత్నించగా వారు ఆయుధాలను క్రింద పడేసి పరారయ్యారు. ఈ సంఘ టనతో ఆగ్రహించిన మనదనేయ మక్కల్ కట్చి కార్యకర్తలు కాల్‌ట్యాక్సీని ధ్వంసం చేశారు. కాల్‌టాక్సీ డ్రైవర్‌ను ముడిచ్చూరు సమీపంలోగల వరదరాజపురానికి చెందిన మహేష్ (30), సౌందరరాజ్‌ను పట్టుకున్నారు. సమాచారం అందుకున్న తాంబరం పోలీసులు అక్కడకు చేరుకుని స్థలం చేరుకున్నారు. వారి వద్ద ఇరువురిని అప్పగించారు.
వారి వద్ద నుంచి కాల్ ట్యాక్సీని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న డీఎంకే, ఎంఎంకే, వీసీకే పార్టీలకు చెందిన కార్యకర్తలు పోలీసుస్టేషన్ చేరుకున్నారు. డెప్యూటీ కమిషనర్ తిరుజ్ఞానం అక్కడికి చేరుకుని చర్చలు జరిపారు. పోలీసులు పెట్రోలు బంక్‌లో నమోదైన సీసీ కెమెరాల ద్వారా విచారణ జరుపుతున్నారు.