అలంకారప్రియునికి అమూల్య ఆభరణాలు | Precious jewels of Sri venkateswara Swamy | Sakshi
Sakshi News home page

అలంకారప్రియునికి అమూల్య ఆభరణాలు

Published Sun, Sep 20 2015 1:47 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM

అలంకారప్రియునికి అమూల్య ఆభరణాలు - Sakshi

అలంకారప్రియునికి అమూల్య ఆభరణాలు

 * బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్యాలు శ్రీవారి సొంతం.. 
* మార్కెట్ ధర ప్రకారం రూ.50 వేల కోట్లకుపైగా విలువ
సాక్షి, తిరుమల: దివ్యతేజోమూర్తి శ్రీవేంకటేశ్వర స్వామివారు అలంకార ప్రియుడు. వస్త్రాలంకారం, పుష్పాలంకారంతోపాటు బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య తదితర ఆభరణాల అలంకారాల్లో స్వామిని దర్శిస్తూ పరవశించిపోతోంది భక్తకోటి. స్వామికి అలంకరించే ఆభరణాల విలువ అమూల్యం.
 
రూ.50 వేల కోట్లకు పైమాటే
శ్రీవారి ఆభరణ సంపత్తి వివరాలను భద్రతా కారణాల రీత్యా టీటీడీ అత్యంత గోప్యంగా ఉంచింది. అనధికారిక లెక్కల ప్రకారం స్వామివారి ఆభరణాలు, బంగారు వస్తువులు మొత్తం 11 టన్నులు ఉండవచ్చని అంచనా. వాటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.32 వేల కోట్లకు పైగా ఉండవచ్చని నిపుణుల విశ్లేషణ. మార్కెట్ ధర ప్రకారం కనీసం రూ.50 వేల కోట్లకుపైగా ఉంటుందని సమాచారం.

గర్భాలయమూర్తి, ఉత్సవమూర్తుల అలంకరణలకు అలనాడు రాజులు, రాజవంశీకులు, ఆర్కాటు నవాబులు, బ్రిటిష్ ప్రభువులు, మహంతులు ఎన్నెన్నో ఆభరణాలు తయారు చేయించారు. కిరీటాలు, నిలువెత్తు ఆభరణాలు, వజ్రాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నవరత్నాలు పొదిగిన నగ లు, ఇతర బంగారు సామగ్రిని కానుకగా అందజేశారు.  
 
మూలమూర్తి అలంకరణలో ఆభరణాలు
సువర్ణ పద్మపీఠం, సువర్ణ పాదాలు, నూపురాలు, పాగడాలు, కాంచీ గునం, అంకెలు, వడ్డాణాలు, ఉదర బంధం, చిరుగంటలతో కూడిన దశావతార హారం, చిన్న కంఠాభరణం, బంగారు పులిగోరు హారం, గోపు హారం, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, 4 కిలోల చతుర్భుజ లక్ష్మీహారం, అష్టోత్తర శతనామ హారం, 32 కిలోల సహస్ర నామహారం, సూర్య కఠారి, వైకుంఠ హస్తం, కఠిహస్తం, కడియాలు, కర భూషణాలు, భుజదండ భూషణాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, కర్ణపత్రాలు, శంఖు చక్రాలు, ఆకాశరాజు కిరీటం, సాలిగ్రామ హారం, తిరుక్కాళం, వజ్ర అశ్వర్థపత్ర హారం, ఐదు పేటల కంఠి, చంద్రవంక కంఠి, ముఖపట్టీ, శ్రీవత్సం, కౌస్తుభం, బంగారు పీతాంబరాలు.  
 
కిరీటాలు ఎన్నెన్నో
వజ్రాల హారం, వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు, వజ్రాల కఠిహస్తం, వజ్రాల కిరీటం(బరువు 13.360 కేజీలు, విలువ రూ.5 కోట్లు) స్వామివారికి ఉన్నాయి. శ్రీవారి అరుదైన ఆభరణాల్లో అరుదైన గరుడ మేరు పచ్చ ఉంది. దీని బరువు 500 గ్రాములు. స్వామివారికి అధికారికంగా ముఖ్యమైన ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటితోపాటు పురాతన కిరీటాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు మరో ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటిలో వజ్ర కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement