‘హెచ్1బీ దుర్వినియోగాన్ని అడ్డుకోండి’
వాషింగ్టన్: అమెరికాలోని ఔట్‌సోర్సింగ్ కంపెనీలు హెచ్1బీ, ఎల్1 వీసాలను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని ఆ దేశ చట్టసభల ప్రతినిధుల బృందం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ సభ్యుల బృందం ట్రంప్‌కు లేఖ రాసింది. ఔట్‌సోర్సింగ్ సంస్థలు స్థానికులకు బదులుగా విదేశీ ఉద్యోగులను చౌకగా అమెరికాకు తరలిస్తున్నాయని ఆరోపించింది.
అమెరికన్ల ప్రయోజనాలను రక్షించేందుకు బిల్లును ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఉద్యోగాల భర్తీ సమయంలో స్థానికులకే ప్రాధాన్యమివ్వడంతోపాటు అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించి మరొకరికి కట్టబెట్టడాన్ని ఈ బిల్లు నిషేధిస్తుందని తెలిపింది. 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న అమెరికన్ ఔట్‌సోర్సింగ్ సంస్థల్లో 50% కంటే ఎక్కువ మంది హెచ్1బీ, ఎల్1 ఉద్యోగులుంటే కొత్తగా విదేశీయులను నియమించుకోవడాన్ని ఈ బిల్లు నిషేధిస్తుందని వెల్లడించింది.