బంకులో పెట్రోల్ పోయించుకుంటున్న యువకుడు
నిప్పంటించుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
రాంగోపాల్‌పేట్: ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 35 ఏళ్ల యువకుడు శనివారం ఉదయం సికింద్రాబాద్ సంగీత్ ధియేటర్ వద్ద ఆటోలో దిగాడు. అక్కడే ఉండే పెట్రోల్ బంకులో బాటిల్‌లో లీటర్ పెట్రోల్ పోయించుకున్నాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ బషీరా హోటల్ ఎదురుగా ఉండే మరో పెట్రోల్ బంకుకు వెళ్లి అక్కడ మరో బాటిల్‌లో పెట్రోల్ పోయించుకున్నాడు.
అక్కడి నుంచి ఎస్పీరోడ్ వైపు వెళుతూ బిషప్ కార్యాలయం మూలమలుపు వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలకు తట్టుకోలేక అరుస్తూ బిషప్ కార్యాలయం గేటు నుంచి లోపలికి వెళ్లగా వాచ్‌మెన్ రాంబాబు మంటలు ఆర్పేందుకు యత్నించి సాధ్యం కాకపోవడంతో 108కు సమాచారం అందించాడు. వారు వచ్చి చూడగా అప్పటికే 80శాతం కాలిన గాయాలతో మరణించాడు.ఉత్తర మండలం డీసీపీ సుమతి, ఏసీపీ శ్రీనివాస్‌లు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడు ఎవరు
అయితే మృతుడు ఎవరనేది అంతుపట్టడం లేదు. బిషప్ హౌజ్, సంగీత్ ధియేటర్ ప్రాంతంలోని పెట్రోల్‌బంకు పరిసరాల్లో సీసీ కెమెరాల పుటేజ్ పరిశీలించగా నీలం రంగు చొక్కా, నలుపు రంగు ఫ్యాంటు వేసుకున్న వ్యక్తి ఇన్‌షర్ట్ చేసి ఉన్నాడు. ఆ కెమెరాల్లోని చిత్రాలు అస్పష్టంగా ఉండటంతో మృతుడు ఎవరనేది మిస్టరీగా మారింది. అతని మెడలో క్రీస్తు ఫొటోతో ఉన్న లాకెట్ ఉండటంతో క్రైస్తవుడై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వద్ద ఉన్న బ్యాగు ఉన్నా అందులో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.