ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్న స్టేట్ స్కూల్ ఆఫ్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జిల్లాలో సక్రమంగా అమలు కావడం లేదు.
నెక్కొండ(నర్సంపేట): జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 131 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో పదో తరగతి చదివిన 9,175 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 7,923 మంది ఉత్తీర్ణత (86.35 శాతం) సాధించారు. నమోదైంది. ఈ 2017–18 విద్యా సంవత్సరం అన్ని స్కూళ్లలో కలిపి 8,820 మంది టెన్త్ విద్యార్థులు ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో 5,816 మంది ఉన్నారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ పర్యవేక్షణలో ప్రతి పాఠశాలలో ఉదయం స్కూల్ సమయానికి ముందు 08.30 నుంచి 09.30 వరకు, సాయంత్రం 04.45 నుంచి 05.45 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు నవంబర్‌లో ప్రత్యేక తరగతులు మొదలు పెట్టారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ పర్యవేక్షకులు పట్టించుకోవడంతో ఎక్కడా సక్రమంగా తరగతులు సాగడంలేదు. కొన్ని పాఠశాలల్లో ఉదయం సమయంలో ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కొన్ని పాఠశాలలో టైం టేబుల్‌కు భిన్నంగా ఉదయం 9 గంటల తరువాత, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో నవంబర్ రెండో వారంలో మొదలు పెట్టినా వారం రోజులకే ముగించేశారు.
ప్రోత్సాహకాలు ప్రకటించినా..
పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలకు రూ.2లక్షలు, 10/10 సాధించిన విద్యార్థి పేరు మీద రూ.లక్ష చొప్పున పాఠశాల అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ అమ్రపాలి ప్రకటించిన విషయం విధితమే. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు సక్రమంగా నడవకపోగా పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో ఎలా ఉంటాయోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఆరు బృందాలు పర్యవేక్షిస్తున్నాయి
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పదో తరగతి స్పెషల్ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం. ఈ ప్రత్యేక తరగతులను పర్యవేక్షించేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. తరగతుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
– కె.నారాయణరెడ్డి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment