చక్రవర్తి పట్టాభిషేకం.. వింత ఆచారం | A Strange Custom in the Coronation of the Emperor of Japan | Sakshi
Sakshi News home page

జపాన్‌​ చక్రవర్తి పట్టాభిషేకం.. వింత ఆచారం

Published Thu, Nov 14 2019 7:09 PM | Last Updated on Thu, Nov 14 2019 8:30 PM

A Strange Custom in the Coronation of the Emperor of Japan - Sakshi

జపాన్‌ నూతన చక్రవర్తి నరుహిటో

టోక్యో : జపాన్‌ నూతన చక్రవర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరుహిటో ఆచారం ప్రకారం చేసే డైజోసాయి అనే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఇంతకు ముందు 30 ఏళ్లు చక్రవర్తిగా ఉన్న నరుహిటో తండ్రి అకిహిటో గత ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయగా, మేలోనే ఈ కార్యక్రమం నిర్వహించాల్సింది. అయితే జపాన్‌లో ఘోరమైన తుపాన్‌లు రావడంతో ‘డైజోసాయి’ ఆలస్యమైంది. పట్టాభిషేకానంతరం నిర్వహించే ఆచారంలో చివరిదీ, ముఖ్యమైనది డైజోసాయి. ఈ ఆచార కార్యక్రమంలో నరుహిటో గురువారం పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి పూర్వం జపాన్‌వాసులు తమ చక్రవర్తులను అమతెరసు ఒమికామి అనే సూర్య దేవత అంశగా భావించేవారు. డైజోసాయి ఆచారం వెయ్యి సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నా.. క్రీస్తు శకం 1800 చివర్లో మరింత బలపడింది. అప్పటి జపాన్‌ చక్రవర్తి చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యాలను జయించి, వాటన్నింటినీ కలిపి ఒకే దేశంగా నిలిపే ప్రయత్నం చేశాడు. ఈ విజయాలను వివరిస్తూ అప్పట్లో విద్యార్థులకు బోధించే పాఠ్యపుస్తకాల్లో చక్రవర్తి గొప్పదనం గురించి పాఠాలు ఉండేవి. నరుహిటో తాత హిరోహిటో చక్రవర్తిగా ఉన్నప్పుడు (1926 - 1989) చక్రవర్తికి దైవశక్తి ఉందని, సూర్యదేవత అయిన అమతెరసు ఒమికామితో సంబంధాలుండేవని, అందుకే చక్రవర్తికి ఓటమి లేదని విద్యార్థులకు బోధించేవారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఓడిపోయాక చక్రవర్తికి ఉన్న దైవత్వాన్ని పుస్తకాల్లోంచి తొలగించారు. అయితే డైజోసాయి ఆచారం మాత్రం అలాగే కొనసాగుతోంది. కొత్తగా చక్రవర్తి అయ్యేవారు ఈ ఆచారాన్ని పాటించాల్సిందే.

చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవం
డైజోసాయి ప్రకారం.. రాజ ప్రసాద మైదానంలో చెక్కతో నిర్మించిన రెండు ప్రత్యేక భవంతులను ఏర్పాటు చేస్తారు. తెల్లటి వస్త్రాలు ధరించిన చక్రవర్తి, మసక వెలుతురు ఉన్న మొదటి భవంతిలోకి ఒంటరిగా వెళ్తాడు. అందులో ఓక్‌ ఆకులతో చేసిన 32 ప్లేట్లలో నైవేద్యం నింపి, తెల్లటి వస్త్రాలతో కప్పి ఉంచిన ప్రదేశం ముందు మోకరిల్లి జపాన్‌ శాంతి కోసం ప్రార్థనలు చేస్తాడు. అనంతరం దేవతతో కలిసి అన్నం, తృణ ధాన్యాలు, వరితో చేసిన పానీయాన్ని సేవిస్తాడు. ఈ తతంగం పూర్తవ్వడానికి రెండున్నర గంటలు పడుతుంది. ఇలాగే మరో భవంతిలో మరోసారి చేస్తారు. ఇలా తెల్లవారుజాము మూడు గంటలలోపు ఈ కార్యక్రమం పూర్తవుతుంది.  అనంతరం ఆ రెండు భవంతులను దహనం చేసేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని షింజో అబెతో సహా దేశంలోని ప్రముఖులను ఆహ్వానించినా, భవంతి లోపలికి ఎవ్వరికీ అనుమతించరు. దీని గురించి క్యోటోలోని అంతర్జాతీయ జపనీస్‌ స్టడీస్‌ కేంద్ర అధ్యాపకుడు జాన్‌ బ్రీన్‌ అభిప్రాయంలో ‘డైజోసాయి లాంటి కార్యక్రమాలు చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవంలో చాలా ఉంటాయి. కాకపోతే డైజోసాయి అనేది బహిరంగ కార్యక్రమం కనుక అందరి దృష్టి దీని మీద ఉంటుంది. ఈ ఆచారంపై జపాన్‌ వాసుల్లో చాలా మందికి మంచి నమ్మకం ఉంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు చాలా మంది జపనీయులు తరలివస్తారు. అంతేకాక, ఈ కార్యక్రమం తర్వాత తమ చక్రవర్తి పరిపూర్ణ వ్యక్తిగా రూపాంతరం చెందుతాడనే నమ్మకం చాలా బలంగా ఉంద’ని వివరించారు. 

మరోవైపు ఈ కార్యక్రమానికి అవుతున్న ఖర్చు జపాన్‌ కరెన్సీలో 2.07 బిలియన్ల యెన్‌లు. అమెరికా డాలర్లలో చూస్తే దాదాపు 25 మిలియన్‌ డాలర్లు. ఈ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఈ విషయంలో కొందరు విభేదిస్తున్నారు. ఎలాంటి ప్రయోజనాలు లేని ఇలాంటి ఆచారాలకు ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కోర్టులో కేసులు కూడా వేశారు. కేసులు వేసిన బృందానికి నాయకత్వం వహిస్తున్న కొయిచి షిన్‌ (60) అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘ఈ ఆచారానికయ్యే ఖర్చును రాజకుటుంబీకుల సొంత ఖజానా నుంచి పెట్టుకోవాలి. ప్రజల సొమ్ము ఈ విధంగా దర్వినియోగం చేయడం సరికాదు. ఈ ప్రతిపాదనకు కొత్త చక్రవర్తి తమ్ముడు అకిషినో కూడా సమర్థించారు. మరోవైపు ఈ తతంగాన్ని నిరసిస్తూ 30 ఏళ్ల కింద అకిహిటో పట్టాభిషేకం సందర్భంగా కోర్టుల్లో 1700 మంది కేసులు వేశారు. ఈ సారి ఆ సంఖ్య 318కి తగ్గింది. అయినా కోర్టు నిర్ణయం మాకు అనుకూలంగా వస్తుందనే నమ్మకం లేదు. కానీ మతం, రాజ్యం ఒక్కటిగా ఉండడం తప్పు. ఇది మంచి పద్ధతి కాదనే భావనను విస్తృతపరచడమే మాకు ప్రధానమ’ని తెలిపారు. జపాన్‌లో ప్రధాన మతం బౌద్ధం. 99.99 శాతం ప్రజలు ఆ మతస్థులే. క్రిస్టియన్లు, ముస్లింలు, కమ్యూనిస్టులు చాలా  తక్కువగా ఉంటారు. డైజోసాయికి వ్యతిరేకంగా కేసులు వేసేవారిలో వీరే ముందుంటున్నారు.     - రవీందర నాయక్‌, సాక్షి వెబ్‌ డెస్క్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement