మహానందిలో కూలిన అభిషేక మండపం
కర్నూలు : కర్నూలు జిల్లా మహానందిలో నిర్మాణంలో ఉన్న అభిషేక మండపం శనివారం ఒక్కసారిగా నేల కూలింది. దేవస్థానం నిధులు, భక్తులిచ్చిన విరాళాలతో సుమారు 50లక్షల వ్యయంతో మండపం పనులను ఇటివలే ప్రారంభించారు. ఉదయం మండపంలోని కొద్దిభాగం కూలిపోయింది. అక్కడే నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జునయ్య, మరో ఇద్దరు కూలీలు స్వల్పంగా గాయపడ్డారు.
మండపం నిర్మాణం నాసిరకంగా ఉండడం వల్లే కూలిపోయిందని విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గతంలో కూడా దేవస్థానంలోని ధ్వజస్థంభం రాతి ద్వారాలు కూలిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మహానంది క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న మండపం నేల కూలడం భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.