చిన్నారిపై అత్యాచారయత్నం
కందుకూరు, న్యూస్‌లైన్: అభంశుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామానికి చెందిన అచ్చన భిక్షపతి(31) స్థానికంగా మేస్త్రీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి ఇంటి సమీపంలో ఉంటున్న ఓ బాలిక(8) తల్లి చనిపోవడంతో నాయనమ్మ దగ్గర ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది.
బుధవారం మధ్యాహ్నం సమయంలో పాఠశాల నుంచి వచ్చిన బాలికను భిక్షపతి తినుబండారాల కోసం దుకాణానికి పంపించాడు. వాటిని తీసుకుని చిన్నారి ఇంట్లోకి రాగానే అతడు తలుపులు వేసి అత్యాచారానికి యత్నించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక కేకలు వేస్తూ బయటికి పరుగెత్తి స్థానికులకు విషయం తెలిపింది. గ్రామస్తులు భిక్షపతిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని కందుకూరు పోలీసులకు అప్పగించారు. సీఐ జానకీరెడ్డి ఆధ్వర్యంలో నిందితుడిపై ‘నిర్భయ’ చట్టం కింద కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు.