AP: సరికొత్త పాలనకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: చరిత్రాత్మకంగా ఏర్పాటైన కొత్త జిల్లాల్లో నేటి నుంచి కార్యకలాపాలు సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం 9.05 గంటలకు 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మిగిలిన శాఖల జిల్లా అధికారులు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత జిల్లా కేంద్రాలు, కొత్త జిల్లా కేంద్రాలకు కేటాయించిన ఉద్యోగులకు ఇప్పటికే ఆర్డర్ టు సెర్వ్ ఉత్తర్వులు జారీ చేయడంతో వారు కూడా నేటి ఉదయం విధుల్లో చేరనున్నారు.
9.45 గంటలలోపు అధికారులు, ఉద్యోగులు కొత్త జిల్లా కేంద్రాల్లో విధుల్లోకి రానున్నారు. ఇందుకోసం పాత జిల్లా కేంద్రాలు, కొత్తగా ఏర్పడుతున్న 13 జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయాలు, ఇతర జిల్లా కార్యాలయాలు ముస్తాబయ్యాయి. 70% కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట మాత్రమే ప్రైవేట్ భవనాలు ఎంపిక చేశారు.
విజయవాడలో సిద్ధమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్.
అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రాలైన అనకాపల్లి, భీమవరంలో ప్రభుత్వ భవనాలు ఒక్కటీ అందుబాటులో లేకపోవడంతో అక్కడ కలెక్టరేట్ సహా అన్నింటినీ ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటవుతున్న సత్యసాయి జిల్లాలో ఎస్పీ క్యాంపు కార్యాలయం మినహా మిగిలిన ముఖ్య కార్యాలయాలు సత్యసాయి ట్రస్ట్ భవనాల్లో పెడుతున్నారు. రాయచోటి కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న అన్నమయ్య జిల్లాలోనూ ఎక్కువగా ప్రైవేటు భవనాలనే ఎంపిక చేశారు.
నరసరావుపేట కేంద్రంగా ఏర్పాటు కానున్న పల్నాడు, తిరుపతి కేంద్రంగా ఏర్పాటవుతున్న బాలాజీ, నంద్యాల కేంద్రంగా ఉండే నంద్యాల, పార్వతీపురం కేంద్రంగా ఏర్పడుతున్న పార్వతీపురం మన్యం, రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటయ్యే తూర్పుగోదావరి, విజయవాడ కేంద్రంగా ఏర్పడుతున్న ఎన్టీఆర్ జిల్లాల్లో పూర్తిగా ప్రభుత్వ భవనాల్లోనే ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రెండు, మూడు చోట్ల తప్ప ఆర్డీవో కార్యాలయాలన్నింటికీ ప్రభుత్వ భవనాలే ఎంపిక చేశారు. ఈ కార్యాలయాల్లో అవసరమైన సివిల్, విద్యుత్ మరమ్మతు పనులు పూర్తవడంతోపాటు ఫర్నిచర్ సమకూర్చారు.
విజయవాడలో సిద్ధమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్. కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్
కార్లు, ఫర్నీచర్ విభజన పూర్తి
ప్రస్తుత జిల్లా కేంద్రంలో ఉన్న కార్లు, ఇతర వాహనాలు, ఫర్నిచర్, స్టోరేజి ర్యాకుల విభజన చాలా వరకు పూర్తయింది. ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అవసరమైన వాటిని అక్కడే ఉంచి మిగిలిన వాటిని కొత్తగా ఏర్పడుతున్న జిల్లాలకు ఇచ్చారు. ఆ జిల్లాలకు అవి చాలకపోతే, అవసరమైన మేరకు కొత్తగా సమకూర్చుకుంటున్నారు.
కంప్యూటర్లు, ఇతర విడిభాగాలు, వీడియో కాన్ఫరెన్స్ ఎక్విప్మెంట్.. తదితర వాటి విభజన కూడా పూర్తయింది. పునర్వ్యవస్థీకరణను బట్టి జిల్లాల్లో ఫైళ్ల విభజన వేగంగా జరుగుతోంది. కొత్త జిల్లాల పరిధిలోకి వచ్చే రెవెన్యూ డివిజన్లు, మండలాలను బట్టి ఈ విభజన చేస్తున్నారు. ఇటీవల ఎక్కువగా ఈ–ఫైల్స్ వ్యవస్థ నడుస్తుండడంతో ఈ పనికి పెద్దగా ఇబ్బంది లేదని చెబుతున్నారు.