మన రాకెట్లకు గాలి నుంచే ఇంధనం!
శ్రీహరికోట: పునర్వినియోగ రాకెట్ (ఆర్ఎల్వీ) తయారీలో తొలి అడుగును విజయవంతంగా వేసిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఇస్రో) తాజాగా గాలి నుంచే రాకెట్‌కు ఇంధనాన్ని అందించేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటివరకు లిక్విఫైడ్ ఆక్సిజన్‌ను అన్ని లాంచింగ్ వెహికల్స్‌లో ముందుగానే ఉంచి ప్రయోగించిన ఇస్రో.. త్వరలో నింగిలోకి దూసుకెళ్లేపుడు రాకెట్ అవసరానికి అనుగుణంగా ఆక్సిజన్ ను గాల్లోంచే తీసుకునేలా ప్రయోగం చేయనుంది.
సాధారణంగా రాకెట్లలో వాడే ఆక్సిడైజర్‌తో కూడిన కంబష్షన్ ప్రొపెల్లెంట్స్కు బదులు ఎయిర్ - బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టంలను ఉపయోగించనున్నట్లు ఇస్రో డైరెక్టర్ కె.శివన్ తెలిపారు. జూన్ చివరివారంలో లేదా జూలై మొదటివారంలో ఈ ప్రయోగం చేస్తామన్నారు. భూమి నుంచి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆక్సిజన్ విరివిగా లభింస్తుందని.. ఈ దశలోనే రాకెట్ ఆక్సిజన్‌ను వాతావరణం నుంచి సేకరించేలా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశామని చెప్పారు. దీంతో రాకెట్ ఆకాశంలోకి మోసుకుపోవాల్సిన బరువు, వ్యయం బాగా తగ్గుతాయని వివరించారు. డ్యుయల్ మోడ్ రామ్ జెట్ (డీఎమ్ఆర్జే) ను ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నామని, ఇది విజయవంతమైతే పునర్వినియోగ రాకెట్ లాంచింగ్ వెహికల్ కల సాకారానికి బాటలు పడినట్లవుతుందని అన్నారు.