all india chess tourney
-
ఖేల్‌రత్న రేసులో తెలుగు తేజాలు
చెన్నై: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ కోసం ఈసారి భారీగానే దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరించేందుకు మరో మూడు రోజులు ఉన్నందున ఆయా జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలు తమ అత్యుత్తమ క్రీడాకారుల పేర్లను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం నామినేట్ చేస్తున్నాయి. తాజాగా అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) భారత మహిళా చెస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి పేరును ‘ఖేల్‌రత్న’ కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 34 ఏళ్ల హంపి 2019 డిసెంబర్లో ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా గతేడాది అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్‌లోనూ టైటిల్ సాధించింది. మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భాగంగా 2019లో రష్యాలో జరిగిన తొలి టోర్నీలో చాంపియన్‌గా, మొనాకో లో జరిగిన రెండో టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా గ్రాండ్‌ప్రి సిరీస్‌లో రెండో స్థానంలో నిలిచి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది. ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులోనూ హంపి సభ్యురాలిగా ఉంది. హంపికి 2003లోనే అర్జున అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబుతోపాటు ఇతర ప్లేయర్లు విదిత్ గుజరాతి, ఆధిబన్, సేతురామన్, భక్తి కులకర్ణి, పద్మిని రౌత్ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ఏఐసీఎఫ్ గౌరవ కార్యదర్శి భరత్ సింగ్ చౌహాన్ నామినేట్ చేశారు. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్... తెలంగాణకు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ పేర్లను ‘ఖేల్‌రత్న’ కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సిఫారసు చేసింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో సాయిప్రణీత్ ఒక్కడే అర్హత సాధించాడు. మరోవైపు 2017లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన శ్రీకాంత్ ఆ తర్వాత చెప్పుకోతగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ చోప్రా, సమీర్ వర్మ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ‘బాయ్’ ప్రతిపాదించింది. ‘ధ్యాన్‌చంద్ అవార్డు’ కోసం ఒలింపియన్ పీవీవీ లక్ష్మి, లెరాయ్ డిసా పేర్లను... ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం భాస్కర్ బాబు, మురళీధరన్ పేర్లను ‘బాయ్’ పంపించింది. అవార్డీల కమిటీ మొత్తం దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు తొలి వారంలో తుది అవార్డులు గెల్చుకున్న వారి జాబితాను ప్రకటించే అవకాశముంది. -
తొలిరౌండ్లో జీవితేశ్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) సాయి అగ్ని జీవితేశ్ శుభారంభం చేశాడు. ప్రుఫర్ లాజిక్ అండ్ స్ఫూర్తి చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన తొలిరౌండ్ గేమ్‌లో తెలంగాణకే చెందిన పి. శశిధర్‌పై జీవితేశ్ గెలుపొందాడు. ఇతర బోర్డుల్లో మాధవ చిట్ట (తెలంగాణ)పై పి. భరత్ కుమార్ రెడ్డి (తెలంగాణ), ఎస్. నరసింగా రావుపై వి. వరుణ్ (తెలంగాణ), అర్పిత (తెలంగాణ)పై ప్రవీణ్ ప్రసాద్, జి. వీణ (తమిళనాడు)పై కౌస్తుభ్ కుందు (పశ్చిమ బెంగాల్) విజయం సాధించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు చెందిన మొత్తం 282 మంది క్రీడాకారులు తలపడతున్నారు. స్విస్ లీగ్ పద్ధతిలో 9 రౌండ్ల పాటు పోటీలు జరుగుతాయి. -
అగ్రస్థానంలో జీవితేశ్
సాక్షి, హైదరాబాద్: ‘నిథమ్’ ఆలిండియా ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్లో నాలుగో రౌండ్ తర్వాత టాప్ సీడ్ ఫిడే మాస్టర్ అగ్ని జీవితేశ్ ... ప్రదీప్, చక్రవర్తి రెడ్డి, శ్రీశ్వాన్, సౌరభ్, మైత్రేయన్, బాలకిషన్, లోకేశ్, విక్రమ్‌జీత్ సింగ్, శ్రీనివాస రావు, కనిష్క్, వైభవ్, బాలకన్నమ్మలతో కలసి నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా తొలి స్థానంలో ఉన్నాడు. నిథమ్ క్యాంపస్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్లో సాయి అగ్ని జీవితేశ్ (తెలంగాణ, 4) దివ్యాలక్ష్మి (తమిళనాడు, 3)పై విజయం సాధించాడు. ఇతర గేముల్లో ప్రదీప్ (తమిళనాడు, 4) విశ్వనాథ్ ప్రసాద్ (తెలంగాణ, 3)పై, చక్రవర్తి రెడ్డి (తెలంగాణ, 4) అంకన్ (బెంగాల్, 3)పై, శ్రీశ్వాన్ (తెలంగాణ, 4) వరుణ్ (తెలంగాణ, 3)పై గెలుపొందారు. శరణ్య (తమిళనాడు, 3.5), శేఖర్ (తమిళనాడు, 3.5)ల మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది. -
ఆలిండియా చెస్ టోర్నీ ప్రారంభం
రాయదుర్గం: ‘నిథమ్’ ఆలిండియా ఓపెన్ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ గురువారం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని నిథమ్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్) ప్రాంగణంలో ఆరు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) నిర్వహిస్తోన్న ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 10 లక్షలు. తెలంగాణతోపాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, హరియాణా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, కేరళ, గోవా, తమిళనాడు, రైల్వేస్, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన మొత్తం 360మంది క్రీడాకారులు ఈ టోర్నీలో తలపడుతున్నారు. అంతర్జాతీయ మాస్టర్లు రాహుల్ సంగ్మా (రైల్వేస్), చక్రవర్తి రెడ్డి (తెలంగాణ), ఆర్. బాల సుబ్రమణియం (తమిళనాడు) ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు ఐదుగురు ‘ఫిడే’ మాస్టర్లు, టాప్ సీడ్ జె. సాయి అగ్ని జీవితేశ్ పాల్గొంటున్నారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి భాగ్యనగరం స్పోర్ట్స్ హబ్‌గా మారాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం క్రీడల్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిథమ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. చిన్నం రెడ్డి, టీఎస్‌సీఏ కార్యదర్శి కె.ఎస్. ప్రసాద్, ఉపాధ్యక్షులు శివప్రసాద్, కోశాధికారి అంజయ్య, కార్య నిర్వాహక కార్యదర్శి సయ్యద్ ఫయాజ్, నిథమ్ అధికారులు, చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు.