బాధిత రైతులకు పరిహారం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్:
భారీ వర్షాలకు నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి అనీల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంట నష్టాలపై వ్యవ సాయ శాఖ అధికారులతో గురువారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని బాధిత రైతులకు అన్ని విధాలా సాయపడాలని ఆదేశించారు. జిల్లాలో వాతావరణం, పంటల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంటల నష్టం అంచనా ఎంతమేరకు జరిగిందనే విషంయపై ఆరా తీశారు. రైతులు ఏయే పంటలు ఖరీఫ్‌లో చేపట్టారు, వాటికి అమలు చేసిన పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పొలం బడి, గ్రామీణ విత్తనోత్పత్తి, వ్యవసాయాంత్రీకరణ, పంట రుణాలు, రుణ అర్హత కార్డులు, వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ తదితర కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ కె.లక్ష్మణరావు, ఆత్మ పీడీ శివప్రసాద్,ఇతర వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.