'చిన్నారులకు పశువుల దాణా'
భోపాల్: గతంలో ఓ సారి వివాదాస్పద వ్యాఖ్యలుచేసి పతాకశీర్శికల్లో కనిపించిన కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తాజాగా మరోసారి అదేపని చేశారు. అయితే ఈసారి ఆమె మాట్లాడింది మతసంబంధిత విషయంకాదు. చిన్నారుల పౌష్టికాహారం గురించి.
భోపాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాధ్వి.. అంగన్ వాడీల్లో పిల్లలకు అందిస్తోన్న ఆహారంపై స్పందించారు. 'పౌష్టికాహారం పేరుతో అన్ని అంగన్ వాడీ సెంటర్లలో చిన్నారులు, మహిళలకు పశువుల దాణా పెడుతున్నారు. నిజానికి ఆ ఆహారం బలవర్దకమైనదో కాదో ఎవ్వరికీ తెలియదు' అని వ్యాఖ్యానించారు.
ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుతో ఈ సమస్యను అధిగమించొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కొరత ఉందని, వాటి సంఖ్యను పెంచాల్సిఉందన్నారు. ప్రముఖ ఆహార శుద్ధి సంస్థ రుచి గ్రూప్ మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో ఏర్పాటుచేసిన నూతన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు.