‘మనం’తో మన ముందుకు..
సాక్షి, హైదరాబాద్: అభిమానులను దుఖఃసాగరంలో విడిచి వెళ్లిన నటసామ్రాట్.. త్వరలో ‘మనం’ సినిమా ద్వారా మళ్లీ మన ముందుకు రానున్నారు. తన సహజ నటనతో తాను లేని లోటును మరిపించనున్నారు! సుదీర్ఘ నటప్రస్థానం సాగించిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరిగా ‘మనం’ అనే సినిమాలో నటించారు. తన కుమారుడు నాగార్జున, మనవడు నాగచైతన్యలతో కలిసి అక్కినేని ఈ చిత్రంలో నటించడం విశేషం.
సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి విక్రమ్‌కుమార్ దర్శకత్వ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ఎంతో మందిని ఆకర్షిస్తోంది. 90 ఏళ్ల వయసులో చిన్న పిల్లాడిలా మనవడి కాళ్లదగ్గర కూర్చున్న అక్కినేనిని చూసి అటు ప్రేక్షకుల్లో, ఇటు పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే అక్కినేనికి కేన్సర్ సోకిన విషయం బయటపడింది. చికిత్స తీసుకుంటూనే ఆయన షూటింగ్లో పాల్గొన్నారు. అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో తన గాత్రంలో మార్పు రావచ్చనే సందేహంతో ముందే తన పాత్రకు డబ్బింగ్ కూడా ఇంట్లోనే చెప్పేశారు. ‘మనం’ సినిమాలో తన పాత్రకు సంబంధించిన బాధ్యతలన్నింటినీ పూర్తి చేసేశారు. త్వరలోనే మనం మనముందుకు రానుంది.