పిల్లలే పెద్ద కొనుగోలుదారులు
సర్వే
అవి టీవీలు వచ్చిన తొలిరోజులు... ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తబలా వాయించడం ఆపి గాజు కప్పులో టీ సిప్ చేసి ‘వాహ్ తాజ్’ అంటారు. బ్యాక్డ్రాప్లో తాజ్మహల్ కనిపిస్తుంటుంది. ఈ ప్రకటన చూసిన పిల్లల మెదళ్లలో తాజ్మహల్ అంటే టీ అనే ముద్ర పడిపోయింది. తాజ్మహల్ అనే నిర్మాణం ఒకటుందని, ఆ పేరుతో ఒక కంపెనీ తేయాకు పొడిని తయారు చేసిందని తల్లిదండ్రులు పనిగట్టుకుని తెలియచేయాల్సి వచ్చింది. టీ తాగాలనే కోరిక లేకపోయినా ఉస్తాద్ జాకీర్ హుస్సేన్లా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికే టీ కావాలని మారాం చేసిన పిల్లలు ఎక్కువే అప్పట్లో. అంటే పిల్లల మీద ప్రకటనల ప్రభావం అంతగా ఉంటుందన్న మాట. ఇదే విషయాన్ని ఒక అధ్యయన బృందం కూడా నిర్ధారిస్తోంది.
ఆర్కైవ్స్ ఆఫ్ పీడియాట్రిక్ అండ్ అడాలసెంట్ మెడిసిన్ అనే మ్యాగజైన్ ఒక అధ్యయన నివేదికను ప్రచురించింది పిల్లలు టీవీ చూసే సమయం పెరిగే కొద్దీ వాళ్లు తల్లిదండ్రులను ‘అది కొనివ్వు... ఇది కొనివ్వు’ అని అడగడం పెరుగుతుందట. స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, పకార్డ్ చిల్డ్రన్స్ హాస్పిటల్కు చెందిన బృందం నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. మార్కెట్లోకి కొత్త మోడల్ వీడియో గేమ్స్ వస్తే ఇక అప్పటి వరకు తాను ఆడుకుంటున్న వీడియో గేమ్స్ నచ్చవు. వాటితో ఆడుకోవడం అంటే బోర్, చిరాకు, కొత్తది కొనివ్వలేదన్న అలక. పది నుంచి పధ్నాలుగు ఏళ్ల వయసు పిల్లలున్న ఇళ్లలో ఇదో ప్రహసనం.
ఇక సాధారణంగా ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్, బొమ్మలు అయితే ఎన్ని ఉన్నా, ఎన్ని కొన్నా ఆ తృప్తి కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చే వరకే.
ఒక బొమ్మ కొనిస్తే దాంతో ఆడుకునేది ఒక వారమో లేదా రెండు వారాలే, మూడో వారానికి కొత్త బొమ్మ గురించిన డిమాండ్ ఉండనే ఉంటుంది.
తిండి విషయానికొస్తే వాణిజ్య ప్రకటనల్లో వచ్చే వాటిలో ఎక్కువ భాగం కేలరీలు ఎక్కువగా ఉండి పోషకవిలువలు తక్కువగా ఉండేవే ఉంటున్నాయి. అమెరికాలో సగటున పిల్లలు ఏడాదికి నలభై వేల వాణిజ్య ప్రకటనలను చూస్తున్నారని ఒక అధ్యయనం. ఒక వస్తువును అమ్మాలంటే దాని గుణగణాలను తెలియచేయడానికి సులువైన మార్గం అడ్వర్టైజ్మెంట్. అది తినే వస్తువు అయినా, రాసే పెన్నయినా సరే ఆ వస్తువు ఒకటి మార్కెట్లో ఉంది అని తెలియచెప్పే సాధనమే యాడ్. యాడ్ ఎంత ఆకర్షణీయంగా ఉంటే ఆ వస్తువు అంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోతుందనేది కాదనలేని సత్యం. కొత్త ప్రొడక్ట్ ప్రజల్లోకి వెళ్లడానికి ఒకప్పుడు చాలా పెద్ద నెట్వర్క్ అవసరమయ్యేది. ఇప్పుడు టీవీలు చాలా ఈజీగా మారుమూల పల్లెలకు చేరవేస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీ తయారు చేసిన ఆలూ చిప్స్ గురించి బస్సు వెళ్లడానికి రోడ్డు లేని ఊళ్లో ఉన్న పిల్లలకు కూడా తెలుసు. ఇప్పుడు 5-15 ఏళ్ల పిల్లలు ఆయా కంపెనీలకు ప్రధానమైన మార్కెట్.