భారత్ చేతిలో పాక్ చిత్తు
ఫెడ్ కప్‌లో ఘన విజయం
బరిలోకి దిగని సానియా మీర్జా
ఫెడ్ కప్‌లో భారత జట్టు అంచనాలను అందుకుంటూ శుభారంభం చేసింది. ఏకపక్షంగా సాగిన పోరులో బలహీన పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి అభిమానులకు ఆనందం పంచింది. అయితే విశ్రాంతి కోరుకున్న డబుల్స్ వరల్డ్ నంబర్‌వన్ సానియా మీర్జా బరిలోకి దిగకపోవడం ప్రేక్షకులకు నిరాశ కలిగించింది.
సాక్షి, హైదరాబాద్: ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2) తొలి మ్యాచ్‌లో భారత్ 3-0 తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఎల్బీ స్టేడియం సెంటర్ కోర్టులో బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ పోరులో భారత్ రెండు సింగిల్స్‌తో పాటు డబుల్స్ మ్యాచ్‌నూ గెలుచుకుంది. సింగిల్స్‌లో ప్రార్థన తోంబరే, అంకితా రైనా గెలవగా. డబుల్స్‌లో ప్రార్థన-నటాషా జోడి విజయం సాధించింది. గురువారం జరిగే మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది.
నాన్‌ప్లేయింగ్ కెప్టెన్‌గా సానియా...
మ్యాచ్ ఆద్యంతం భారత ఆటగాళ్ల జోరు కొనసాగింది. కేవలం 50 నిమిషాల్లో ముగిసిన తొలి మ్యాచ్‌లో ప్రార్థన 6-1, 6-0తో సారా మన్సూర్‌పై ఘన విజయం సాధించగా...46 నిమిషాల్లోనే ముగిసిన రెండో సింగిల్స్‌లో భారత్ టాప్ సింగిల్స్ ప్లేయర్ అంకితా రైనా 6-0, 6-1తో ఉష్ణా సుహైల్‌ను చిత్తు చేసింది. అభిమానుల మద్దతుతో భారత యువ క్రీడాకారిణులు దూకుడు ప్రదర్శించారు. మైదానంలో వారు చురుగ్గా కదలగా, బయటినుంచి కెప్టెన్ సానియా మీర్జా పలు సూచనలు చేస్తూ తన జూనియర్లను ప్రోత్సహించింది. పాక్ ప్లేయర్లు కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయారు.
డబుల్స్ మ్యాచ్ కూడా ఇదే తరహాలో సాగింది. నటాషా-ప్రార్థన జోడి 6-0, 6-4 తేడాతో ఇమాన్ ఖురేషీ-ఉష్ణా సుహైల్ జంటను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ కూడా 54 నిమిషాలకే పరిమితమైంది. మలేసియాతో జరిగే మ్యాచ్‌లో కూడా సానియా సహాయక పాత్రకే పరిమితమవుతుందా? లేక మ్యాచ్ ఆడుతుందా చూడాలి. బుధవారం జరిగిన ఇతర మ్యాచ్‌లలో గ్రూప్‘ఎ’లో ఫిలిప్పీన్స్ 3-0తో సింగపూర్‌పై నెగ్గగా... గ్రూప్ ‘బి’లో తుర్క్మెనిస్తాన్ 3-0తో ఇరాన్‌పై గెలిచింది. గ్రూప్ ‘డి’లో పసిఫిక్ ఓషియానికా 3-0తో శ్రీలంకను ఓడించింది.