badminton games
-
ఆసక్తికరంగా బ్యాడ్మింటన్ పోటీలు
అనంతపురం న్యూసిటీ : నగరంలోని స్మాష్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ఆసక్తికరంగా సాగాయి. వివిధ విభాగాల్లో క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. ముఖ్య అతిథి డీఎస్డీఓ బాషామొహిద్దీన్ క్రీడాకారుల బహుమతులనందజేశారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ మాట్లాడుతూ గెలుపోటములు సమానంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. బ్యాడ్మింటన్ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసన్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో ఆడే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ సంఘం సభ్యులు కమతం శ్రీనివాసులు, జయరాజ్, తదితరులు పాల్గొన్నారు. విజేతల వివరాలిలా... అండర్ –17 బాలుర విభాగంలో బి.విజయ్ (యాడికి) విన్నర్, ఎంపీ ఆశిష్‌రెడ్డి (అనంతపురం) రన్నర్‌గా నిలిచారు. అండర్ 17/19 విభాగంలో విన్నర్‌గా శ్వేత నిలిచారు. అండర్ –13 బాలుర విభాగంలో విన్నర్‌గా రామ్గౌని సాకేత్, రన్నర్‌గా గణాదిత్య, బాలికల విభాగంలో ఎంఎస్ ఇషిత విన్నర్‌గా, వి. సృజన రన్నర్‌గా నిలిచారు. -
హోరాహోరీగా బ్యాడ్మింటన్ పోటీలు
అమరాపురం : మండల పరిధిలోని గౌడనకుంట జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం హోరాహోరీగా సాగాయి. ఉదయం పెనుకొండ, అనంతపురం జట్లు తలపడగా అనంతపురం విజయం సాధించింది. అలాగే వీహెచ్ఎస్, కాలేజీ జట్లు తలపడగా వీహెచ్ఎస్ జట్టు విజయం సాధించింది. దేవగానపల్లి, ఉపాధ్యాయుల జట్టు తలపడగా దేవగానపల్లి విజయం సాధించింది. అలాగే అమరాపురం, జీడీఎస్ జట్టు ఆడగా జీడీఎస్ విజయం సాధించింది. అనంతపురం– బీ, బండమీదపల్లి జట్లలో బండమీదపల్లి విజయం సాధించింది. పోటీలు చూసేందుకు మండలం నుంచే కాక కర్ణాటక ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన క్రీడాకారులకు నిర్వాహకులు హనుంతరాయుడు, రాఘవేంద్ర, సిద్ధేశ్వర, శ్రీనివాసమూర్తి, రజీనీకుమార్, ఈరన్న అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం సెమీ,ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
డిసెంబర్లో సినీ తారల బ్యాడ్మింటన్
తమిళసినిమా: సినీ తారల క్రికెట్ క్రీడా వినోదాన్ని చూసిన చెన్నై సినీ, క్రీడాభిమానులు ఇప్పుడు తారల బ్యాడ్మింటన్ క్రీడా పోటీల సందడిని చూడనున్నారు. తారల క్రికెట్ అంటేనే కావలసినంత మజా ఉంటుంది. అలాంటిది ఈ బ్యాడ్మింటన్ క్రీడల్లో సినీ తారలతో పాటు సంగీత, నృత్య కళాకారుల బృందం పాల్గొననుండటం విశేషం. డిసెంబర్ 11 నుంచి 14 వరకు జరుగనున్న ఈ తారల బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు నగరంలోని ఫారం మాల్ వేదిక కానుంది. నటి, నృత్య దర్శకురాలు అభినయ, గ్రీన్స్ గ్రూప్ కంపెనీ అధినేత రోజా గణేష్ కలిసి నిర్వహించనున్న సినీ కళాకారుల బ్యాడ్మింటన్ పోటీల వివరాలను అభినయ తెలుపుతూ, సినీ తారల క్రీడలను అభిమానులు విజయవంతం చేయడం చూస్తున్నామన్నారు. అలాంటి వారందరి కోసం ఈసారి బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సారి చెన్నైలో తారల బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహించడానికి సిద్ధమైనట్లు వివరించారు. ఈ పోటీల్లో సినీ తారలు, నృత్య దర్శకులు, సంగీత కళాకారులు పాల్గొనున్నారని తెలిపారు. ఈ పోటీలను సేవ సంఘాల నిధి కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. గ్రీన్స్ గ్రూప్ కంపెనీ అధినేత రోజాగణేషన్ మాట్లాడుతూ, కళాకారుల బ్యాడ్మింటన్ నాలుగు గ్రూపులుగా ఆడనున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.