పురుగు మందుల ధర పెరగదు
♦ బాయర్ సౌత్ హెడ్ మోహన్ రావు
♦ శివాంటో ప్రైమ్ క్రిమిసంహారిణి విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సస్య రక్షణ ఉత్పత్తుల తయారీ దిగ్గజం బాయర్ క్రాప్ సైన్స్ ఏటా మూడు నుంచి అయిదు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతోంది. ఎనిమిదేళ్లుగా ఈ స్థాయిలో నూతన ప్రొడక్టులను అందుబాటులోకి తెస్తున్నట్టు కంపెనీ సౌత్ బిజినెస్ యూనిట్ హెడ్ ఎన్.మోహన్ రావు గురువారం తెలిపారు. క్రిమి సంహారిణి శివాంటో ప్రైమ్‌ను ఇక్కడి విపణిలో ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వాణిజ్య పంటలు, కూరగాయలపై వచ్చే రసం పీల్చే పురుగును నివారించేందుకు శివాంటో ప్రైమ్ ఉత్తమంగా పని చేస్తుందని చెప్పారు. మొక్కలపై 15 రోజుల వరకు రసాయన ప్రభావం ఉంటుందని, దీంతో రైతుకు ఖర్చులు తగ్గుతాయని తెలిపారు.
ధరలు ఇప్పట్లో పెరగవు..
పురుగు మందులపై గతంలో 12.5 శాతం ఎక్సైజ్ సుంకం, 5 శాతం వ్యాట్ ఉండేది. ఇప్పుడు జీఎస్టీలో 18 శాతం పన్ను శ్లాబులోకి చేర్చారు. పన్ను స్వల్పంగా అధికమైనా, అమ్మకం ధర పెంచడం లేదని మోహన్ రావు వెల్లడించారు. శివాంటో ప్రైమ్ వాడితే రైతుకు ఒక ఎకరానికి రూ.1,000 ఖర్చు అవుతుందని ఈ సందర్భంగా వివరించారు.