ఉద్రిక్తం
► కన్హయ్య రాకతో పటిష్ట బందోబస్తు
► భారీగా మోహరించిన పోలీసు బలగాలు
► అడుగడుగునా ఆంక్షలు
► అయినా ఆగని ఆందోళనలు
సాక్షి, విజయవాడ : బెజవాడలో జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేత కన్హయ్యకుమార్ పాల్గొన్న సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఘర్షణలు చోటుచేసుకోకుండా ఉండాలని వందలాదిమంది పోలీసులను రంగంలోకి దింపారు. భారీగా బలగాలు మోహరించి ఉండగానే బీజేపీ, అనుబంధ విభాగాల నాయకులు , ఏఐఎస్ఎఫ్, వామపక్ష నేతల మధ్య తోపులాటతో మొదలై తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఏబీవీపీ కార్యకర్తలు బుధవారమే నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి కన్హయ్య సభను అడ్డుకుని నిరసన తెలియజేస్తామని అనుమతి కోరడం, ఎట్టి పరిస్థితుల్లోనూ సభను ఆపబోమని వామపక్ష నేతలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
మొదట్నుంచి కొనసాగిన హైడ్రామా...
కన్హయ్యకుమార్ సమావేశం ఆదినుంచి తీవ్ర హైడ్రామా నడుమ కొనసాగింది. తొలుత నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో గురువారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో కన్హయ్య రాకను నిరసిస్తూ బీజేపీ, ఏబీవీపీ నాయకులు ఉదయం సిద్ధార్థ వద్ద ఆందోళన నిర్వహించారు. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఐవీ ప్యాలెస్‌లో ఏర్పాటుచేశారు. పూర్తి ప్రైవేట్ కార్యక్రమం కావడంతో పోలీసులు సమావేశంపై నిఘా ఉంచి విడియో చిత్రీకరించారు. బీజేపీ, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్న క్రమంలో సభాప్రాంగణం వద్ద సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏఐఎస్ఎఫ్ నాయకులు కర్రలతో, వామపక్ష నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మోహరించారు.
బీజేపీ, ఏబీవీపీ భజరంగ్‌దళ్ కార్యకర్తలు సభ వెలుపల నిరసన తెలియజేయడానికి రావడంతో ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు, వరుస దూషణలు చేసుకోగా తోపులాటకు దారితీసింది. దీంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడ్నుంచి పంపివేశారు. అంతకుముందే సభలోకి బీజేపీ నాయకురాలు కర్రి నాగలక్ష్మి వెళ్లగా వామపక్ష కార్యకర్తలు ఆమెతో వాదనకు దిగారు. పోలీసులు వెంటనే ఆమెను అక్కడి నుంచి తీసుకువచ్చి అదుపులోకి తీసుకున్నారు. బయట ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు లక్ష్మీపతితోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 51 మంది బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
500 మంది పోలీసులతో బందోబస్తు
కన్హయ్యకుమార్కు గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టు బయట, నిడమానూరు సెంటర్, రామవరప్పాడు రింగ్ తదితర ప్రాంతాల్లో 70 మంది పోలీసులతో పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నగరంలోకి వచ్చాక ఐవీ ప్యాలెస్ రోడ్డులో టాఫ్రిక్ దారి మళ్లించి రోడ్డుకు రెండువైపులా బ్యారికేడ్లు పెట్టారు. సుమారు 300 మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశా రు. లాఅండ్ ఆర్డర్ డీసీపీ కాళిదాసుతో పాటు నలుగురు ఏసీపీలు బందోబస్తును పర్యవేక్షించారు. ఐవీ ప్యాలెస్ రోడ్డులో హోటళ్లు, షాపులను మూసివేయించారు. అక్కడ కర్ఫ్యూ వాతవరణం నెలకొంది.