భద్రాద్రి పవర్ప్లాంట్ ఎదుట ఆందోళన
ఖమ్మం(పినపాక): ఖమ్మం జిల్లా పినపాక మండలం సీతారామపురం వద్ద నున్న భద్రాద్రి పవర్ ప్లాంట్ ఎదుట ప్రాజెక్టు నిర్వాసితులు గురువారం ఆందోళన నిర్వహించారు. తమకు ప్లాంట్లో ఉద్యోగ అవకాశం కల్పించాలని, ఐటీఐ టెక్నికల్ కోర్సు నేర్పించి వెంటనే ఉద్యోగం కల్పిస్తామన్న హామీని నెరవేర్చాలని ఆందోళన చేపట్టారు. తమను తాత్కాలికంగానైనా కూలీ పనుల్లోకి తీసుకోవాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. పినపాక పరిధిలో సుమారు 286 మంది రైతులు తమ పొలాలను ప్రాజెక్టు కోసం ఇచ్చారు.
]భూమిలిచ్చిన వారిలో 90 మంది తమకు ఉద్యోగం కావాలని కోరుకున్నారు. అందుకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ పత్రాలు కూడా యాజమాన్యం ఇచ్చింది. కానీ యాజమాన్యం ఇప్పటివరకు కేవలం 15 మందిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంది. దీంతో నిర్వాసితులు ఆందోళన చేపట్టారు.