తిమార్పూర్లో అత్యాధునిక ఎస్టీపీ
న్యూఢిల్లీ: పర్యావరణానికి హాని చేయని పద్ధతిలో వ్యర్థాలను తొలగిస్తూ నీటిని శుద్ధీకరించగల అత్యాధునిక మురుగునీటి శుద్ధీకరణ ప్లాంటు (ఎస్టీపీ)ను ప్రయోగాత్మకంగా తిమార్పూర్లో ప్రారంభిం చారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పేటెంటు పొందిన బయో-డిజిస్టర్ టెక్నాలజీ పద్ధతిలో దీనిని సంస్థ నివాసగృహ సముదాయం ఆవరణలో మంగళవారం ప్రారంభించారు. పర్యావరణ అనుకూల విధానంలో వ్యర్థాలను శుద్ధీకరించే అర్కిన్ క్రియేషన్ అనే సంస్థ బయో-డిజిస్టర్ టెక్నాలజీ పద్ధతిని రూపొందించింది. ‘ఈ ప్లాంటు ప్రతినిత్యం 900 మందికి సేవలు అందిస్తుంది. దాదాపు 1.25 లక్షల లీటర్ల నీటిని నిత్యం శుద్ధీకరిస్తుంది. ఇది పర్యావరణానికి హాని చేయకుండా, తక్కువ శక్తితో మున్సిపల్ వ్యర్థాలను బాగుచేస్తుంది’ అని అర్కిన్ క్రియేషన్ డెరైక్టర్ మదన్ఝా అన్నారు.
ఈ విధానంలో రెడ్బెడ్ అనే నిర్మాణం వ్యర్థాలను సమూలంగా తొలగిస్తుంది. తదనంతరం ఫిష్ట్యాంకులోకి జలాలను పంపించి సరఫరాకు సిద్ధం చేస్తారు. వీటిని వ్యవసాయం, బాత్రూమ్లు కడగడం, మొక్కలకు వాడుకోవచ్చని ఝా విశదీకరించారు. ప్లాంటు నిర్వహణకు బయోగ్యాస్నే ఉపయోగిస్తున్నామని, దీనికి మరే ఇతర పరికరాలు, శక్తి అవసరం లేదని డీఆర్డీఓ వర్గాలు తెలిపాయి. పారిశుద్ధ్య కార్మికులు తమ చేతులతో వ్యర్థాలను తొలగించే పద్ధతిని నివారించాలనే ఆలోచనతోనే ఈ విధానానికి రూపకల్పన చేశామని డీఆర్డీఓ శాస్త్రవేత్త లోకేంద్ర సింగ్ అన్నారు.
దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ తరహా ప్లాంటులను ఏర్పాటు చేయవచ్చన్నారు. భారత్ భవిష్యత్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కోనుందని యునిసెఫ్ వంటి సంస్థలు ఇది వరకే హెచ్చరించాయి. వీటి గణాంకాల ప్రకారం ప్రపంచంలో భారత జనాభా 16 శాతం కాగా, జలాల పరిమాణం నాలుగు శాతం మాత్రమే. మనదేశంలో నీటి ఎద్దడికితోడు సరఫరా అస్తవ్యస్తంగా ఉండడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని నిపుణులు చెబుతున్నారు. భూతాపం (గ్లోబల్ వార్మింగ్) కారణంగా భవిష్యత్లో మరిన్ని కరువు కాటకాలు ఏర్పడుతాయని, నీటి ఎద్దడి తీవ్రతరమవుతోందని ఐక్యరాజ్య సమితి ఇది వరకే హెచ్చరించింది. ఢిల్లీలోనూ భూగర్భజల మట్టాలు భారీగా పడిపోతున్నట్టు అధ్యయనాలు తెలిపాయి.