కాటుక కనులు నాటివే!
ఫ్లాష్ బ్యాక్
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అనే ఆర్యోక్తి తెలిసిందే. అన్ని మానవ నాగరి కతల్లోనూ కళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే వారు. కనుల సొగసును తీర్చిదిద్దుకోవడానికి ప్రాచీనులు మక్కువ చూపేవారు. కాటుక, సుర్మా, మస్కారా లాంటి నయనాలం కరణాలు నిన్న మొన్నటివి కావు. వీటికి సహస్రాబ్దాల సుదీర్ఘ చరిత్రే ఉంది. దాదాపు పన్నెండు వేల ఏళ్ల కిందటే ఈజిప్షియన్లు, మెసపటోమియన్ ప్రజలు నల్లని చూర్ణంతో కన్నుల సోయగాన్ని తీర్చి దిద్దుకునేవారు.
రాగి ఖనిజం, యాంటిమొనీ వంటి రకరకాల లోహాలతో తయారు చేసిన చూర్ణాన్ని వారు ఐ లైనర్గా ఉపయోగించే వారు. భారతదేశంలో కూడా కాటుక వాడుక ప్రాచీన కాలం నుంచే ఉండేది. పలు కావ్యాల్లో కాటుక గురించి ఉన్న వర్ణనలే ఇందుకు ఆధారం. ఆముదంతో దీపం వెలి గించి, దాని నుంచి వెలువడిన పొగకు ఏదైనా అడ్డుపెట్టి, దానికి అంటిన మసి నుంచి కాటుక తయారు చేసేవారు.
ఇది కళ్లకు చలవ చేస్తుందని కూడా ప్రాచీన ఆయు ర్వేద నిపుణులు నమ్మేవారు. అయితే, పాశ్చా త్యులు మాత్రం కాటుక వాడుకను చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. ఈజిప్టులోని టుటాంఖమన్ వద్ద 1920లో జరిపిన తవ్వ కాల్లో కాటుకకు సంబంధించిన ఆధారాలు పాశ్చాత్య ప్రపంచానికి తెలిశాయి. అప్పటి నుంచి పాశ్చాత్య ప్రపంచంలోనూ ఐ లైనర్ వాడుక మొదలైంది. కాటుకను అలంకరించు కునేది మహిళలే అయినా, కొన్ని ప్రాంతాల్లో పురుషులు కూడా దీన్ని అలంకరించుకోవడం మొదలైంది.
ప్రాచీనకాలంలో ఐ లైనర్గా ఉపయోగించే కాటుక నల్లగా మాత్రమే ఉండేది. ఆధునిక యుగంలో రంగులు, మెరుపులతో కూడిన మస్కారాలు, కాటుక చేతికి అంటకుండా నేరుగా కళ్లకు రాసు కునేందుకు వీలుగా రకరకాల పెన్సిళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.