కమల్‌నాథ్‌పై సిక్కు అల్లర్ల కేసు!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కమల్‌నాథ్‌పై నమోదైన కేసును రీ–ఓపెన్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించనుంది. కమల్‌నాథ్ కేసుతో పాటు మరో 6 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను సిట్ పునర్విచారణ జరపనుంది. ఈ విషయమై ఢిల్లీ సిక్కుల గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, అకాలీదళ్ ఎమ్మెల్యే మన్జిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ..‘1984 అల్లర్ల కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై నమోదైన కేసును సిట్ పునర్విచారించనుంది.
సిక్కుల ఊచకోతకు సంబంధించి 7 కేసుల్లో నిందితులైన ఐదుగురికి కమల్‌నాథ్ ఆశ్రయం కల్పించారు. గతేడాది నేనుచేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన హోంశాఖ, తాజా సాక్ష్యాల ఆధారంగా మళ్లీ విచారణ జరిపేందుకు వీలుగా కేసు నంబర్ 601/84ను రీ–ఓపెన్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇది అకాలీదళ్ సాధించిన విజయమే. ఈ కేసును మళ్లీ విచారించనున్న సిట్‌కు ధన్యవాదాలు. సిక్కులను కమల్‌నాథ్ చంపుతుండగా చూసిన సాక్షులు ధైర్యంగా ముందుకు రండి. భయపడాల్సిన పనిలేదు.
కమల్‌నాథ్ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు ముక్తియార్ సింగ్, సంజయ్ సూరీ సిట్ ముందు హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చేందుకు అంగీకరించారు. త్వరలోనే కమల్‌నాథ్ అరెస్ట్ అవుతారు. కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు పట్టిన గతే(యావజ్జీవ శిక్ష) కమల్‌నాథ్‌కు పడుతుంది. ’ అని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెంటనే కమల్‌నాథ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలనీ, విచారణ నిష్పక్షపాతంగా సాగేందుకు సహకరించాలని మన్జిందర్ సింగ్ కోరారు. కమల్‌నాథ్‌ను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది?
అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో దాక్కున్న ఖలిస్తాన్ ఉగ్రవాది జర్నైల్‌సింగ్ బింద్రన్‌వాలేను పట్టుకునేందుకు ప్రధాని ఇందిర ఆదేశాలతో ఆర్మీ ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను చేపట్టింది. ఆపరేషన్‌లో స్వర్ణ దేవాలయం తీవ్రంగా దెబ్బతినడం, ఆర్మీ బూట్లతో ఆలయంలోకి వెళ్లడంతో ఈ చర్యను తమ మతంపై దాడిగా సిక్కులు భావించారు. ఈ క్రమంలో 1984, అక్టోబర్ 31న సిక్కు మతస్తులైన సొంత బాడీగార్డులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఇందిరాగాంధీని కాల్చిచంపారు. దీంతో దేశవ్యాప్తంగా సిక్కు మతస్తులు లక్ష్యంగా అల్లరిమూకలు దాడులకు తెగబడ్డాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అల్లర్లలో దేశవ్యాప్తంగా 3,500 మంది సిక్కులు చనిపోగా, ఒక్క ఢిల్లీలోనే 2,800 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు.
ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఢిల్లీలోని రాకాబ్‌గంజ్ గురుద్వారా వద్ద కమల్‌నాథ్ నేతృత్వంలో విధ్వంసానికి దిగిన అల్లరిమూక ఇద్దరు సిక్కులను చంపేసింది. ఈ ఘటనపై 2000లో బీజేపీ ప్రభుత్వం నానావతి కమిషన్‌ను నియమించింది. ఈ సందర్భంగా కమిషన్ ముందు విచారణకు హాజరైన కమల్‌నాథ్.. ‘ఆ రోజున నేను ఘటనాస్థలిలోనే ఉన్నా. ఆవేశంతో ఊగిపోతున్న అల్లరిమూకను శాంతింపజేసేందుకు ప్రయత్నించా’ అని వాంగ్మూలమిచ్చారు. చివరికి నానావతి కమిషన్ ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కమల్‌నాథ్‌ను ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద విడిచిపెట్టింది. తాజాగా ఈ కేసులో కమల్‌నాథ్ పాత్రకు సంబంధించి కొత్త ఆధారాలున్నాయని భావించిన కేంద్రం, కేసును రీ–ఓపెన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.