18- 40 ఏళ్ల లోపు వారే: వీళ్లు ‘డిజిటల్ స్పూన్’తో పుట్టారు!
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు వారే శాసిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఐటీ, డిజిటల్ రంగంలోని కంపెనీలకు వీరు అదనపు లాభాలను తెచ్చిపెడుతున్నారు. ‘బోర్న్ డిజిటల్’గా పిలిచే ఈ తరం వారివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా రూ.1,40,60,000 కోట్ల అదనపు లాభాలను కార్పొరేట్ కంపెనీలు పొందుతున్నాయి. ఏ దేశంలో అయినా బోర్న్ డిజిటల్ జనరేషన్ ఒక శాతం పెరిగితే ఆ దేశ కార్పొరేట్ కంపెనీల లాభాలు 0.9 శాతం పెరుగుతాయట. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు వీరి నాయకత్వంలోనే నడుస్తాయని అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఐటీ కంపెనీ సిట్రిక్స్ తాజా సర్వేలో పేర్కొంది. 10 దేశాల్లో వెయ్యికి పైగా కంపెనీల ప్రతినిధులు, 2 వేల మందికి పైగా ‘బోర్న్ డిజిటల్స్’ను ఆ సంస్థ సర్వే చేసింది.
భారత్‌లో 0.4 శాతమే: 1981–96 మధ్య జన్మించిన మిలీనియల్స్, 1997 తర్వాత జన్మించి అత్యున్నత నైపుణ్యాల (హైఎండ్ స్కిల్స్)తో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారిని ‘బోర్న్ డిజిటల్’గా పిలుస్తారు. పనిచేసే వారిలో వీరి సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే ఆ దేశం అంత ఎక్కువగా ప్రయోజనం పొందుతోందని సర్వే పేర్కొంది. బోర్న్ డిజిటల్ జనాభాతో అమెరికా, చైనా, బ్రిటన్, మెక్సికో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ప్రయోజనం పొందుతుండగా.. జపాన్, ఫ్రాన్స్, భారత్ వంటి దేశాలు ఆ ప్రయో జనాన్ని కోల్పోతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 8.8 శాతం మంది బోర్న్ డిజిటల్ జనాభా ఉద్యోగం చేస్తున్నారు. దీనివల్ల ఆ దేశ కంపెనీలు ఏటా రూ.16,13,200 కోట్ల అదనపు లాభాలు పొందుతున్నాయి. దీనికి భిన్నంగా బోర్న్ డిజిటల్ జనాభా తక్కువగా ఉన్న భారత్‌లో కంపెనీలు ఏటా రూ.16,35,400 కోట్ల లాభాలను నష్టపోతున్నాయి. హైఎండ్ స్కిల్స్‌ను పెంచుకోవడం ద్వారా ఈ నష్టాలను భర్తీ చేసుకోవచ్చని సర్వే సూచించింది.
కుటుంబానికీ ప్రాధాన్యమిస్తున్న బోర్న్ డిజిటల్
కోవిడ్ తగ్గాక కూడా బోర్న్ డిజిటల్ జనాభా తిరిగి కార్యాలయాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని సర్వే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మంది ఇంటి నుంచే పనిచేయడానికే మొగ్గు చూపుతు న్నారు. భారత్‌లో 76 శాతం మంది మాత్రమే ఇంటి నుంచి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. బోర్న్ డిజిటల్ తరం వాళ్లు పని వేళలు కూడా వారికి నచ్చిన విధంగా నిర్ణయించుకునేలా ఉండాలంటు న్నారు. ఇలాంటి అవకాశం కోరుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా 82 శాతం మంది ఉంటే.. భారత్‌లో 86 శాతం మంది ఉన్నారు. వారంలో 4 రోజులు కార్యాలయ పనులకు, 3 రోజులు ఇంటికి కేటాయించేలా ఉండాలని అత్యధికులు కోరుకుం టున్నారు. 4 రోజుల పని దినాలు కావాలని అడుగున్న వారి శాతం 69గా ఉంటే.. భారత్‌లో అది అత్యధికంగా 76 శాతంగా ఉంది.