చక్రస్నానంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు
వడమాలపేట, న్యూస్‌లైన్: అప్పలాయిగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం చక్రస్నానంతో ముగిశాయి. తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు అర్చన, శుద్ధి, తోమాలసేవ, బలిహరణ అనంతరం శ్రీవారి మూలవర్లకు, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లకు అభిషేకం చేశారు.
భక్తుల సర్వదర్శనం అనంతరం వాహన మండపంలో శ్రీవారి వేంచేపు, సమర్పణ జరిగింది. స్వామివారు ఉభయదేవేరులు ఎదురెదురుగా పల్లకీలో ఆశీనులై పురవీధుల్లో ఊరేగారు. అనంతరం ఉభయ నాంచారులతోపాటు స్వామివారికి స్నపన తిరుమంజనం గావించారు. 10 గంటలకు వేదపండితులు శాస్త్రోక్తంగా చక్రస్నానం గావించారు. స్వామివారి చక్రస్నానాన్ని తిలకించిన భక్తులు కోనేరులో మునక వేశారు.
రాత్రికైంకర్యాల తరువాత నవసంధి, మాడవీధుల ఉత్సవం నిర్వహిం చారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమం, ప్రత్యేక నైవేద్యం జరిగింది. 8 గంటలకు అర్చకులకు బహుమానాలతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, ఏఈవో నాగరత్నమ్మ, ఆలయాధికారి శ్రీనివాసులు, వేదపండితులు సూర్యకుమారాచార్యులు, రమణాచార్యులు, రమేషాచార్యులు, నరసిం హాచార్యులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.