Bright Students
-
ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారతీయ చిన్నారి
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల్లో ఒకరిగా 11 ఏళ్ల వయసున్న ఇండియన్ అమెరికన్ నటాషా పేరి ఎంపికైంది. స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్), అమెరికన్ కాలేజీ టెస్టింగ్(యాక్ట్)లలో అసమాన ప్రతిభ చూపించినందుకు అమెరికాలోని న్యూజెర్సీ విశ్వవిద్యాలయం నటాషా పేరిని అత్యంత తెలివైన చిన్నారిగా గుర్తించి గౌరవించింది. అమెరికాలో ఎన్నో కాలేజీల్లో అడ్మిషన్ల కోసం శాట్, యాక్ట్ పరీక్షల్లో వచ్చే స్కోర్‌నే కొలమానంగా తీసుకుంటాయి. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీటీవై) సెర్చ్‌లో భాగంగా నిర్వహించిన శాట్, యాక్ట్ పరీక్షల్లో నటాషా అత్యుద్భుతమైన ప్రతిభ కనబరిచింది. న్యూజెర్సీలోని ఒక ఎలిమెంటరీ స్కూలులో నటాషా చదువుకుంటోంది. సీటీవై నిర్వహించిన పరీక్షల్లో ప్రపంచవ్యాప్తంగా 84 దేశాలకు చెందిన 19 వేల మంది పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సీజన్లో పరీక్షలు నిర్వహించి అత్యంత తెలివైన విద్యార్థుల్ని ఈ సంస్థ ఎంపిక చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం స్ప్రింగ్ సీజన్లో పరీక్షలు రాసిన గ్రేడ్-5కి చెందిన నటాషా తన వయసుకి మించిన ప్రతిభను ప్రదర్శించి గ్రేడ్-8 వారితో సమానంగా స్కోరు సాధించింది. దీంతో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ హై ఆనర్స్ అవార్డుకి ఎంపికైంది. ఇందులో విజయం సాధించడం తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్న నటాషా పేరి తాను ఇంకా ఎంతో సాధిస్తానన్న ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. -
ప్రతిభగల విద్యార్థులకు నెలకు రూ. 75,000
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో అత్యంత ప్రతిభకనబర్చిన వెయ్యిమంది విద్యార్థులకు నెలకు రూ.75వేల స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు కేంద్రమానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. త్వరలోనే ‘ప్రధాని స్కాలర్షిప్’ పేరిట ఈ పథకాన్ని ప్రారంభించే యోచనలో కేంద్రకేబినెట్ ఉందని, ఈ ఫైల్‌పై సంతకం కూడా చేసానని జవదేకర్ స్పష్టం చేశారు. ఐఐటీ ఢిల్లీలో సుమంత్ సిన్హా రెన్యూ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్(సీఈవో) ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పథకంతో ఐఐటీ, యూనివర్సిటీల్లో ప్రతిభ కనబర్చిన పరిశోధన విద్యార్థులకు చేయుతగా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో( యూనివర్సిటీ, ఐఐటీ) అత్యంత ప్రతిభ కనబర్చిన టాప్ వెయ్యి మందికి ఈ స్కాలర్ షిఫ్‌లను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది చిన్న విషయం కాదని, ఇలాంటి పథకం ప్రారంభించడం దేశ చరిత్రలోనే తొలిసారన్నారు. దేశంలో ప్రతిభావంతులను వెలికితీయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని నొక్కి చెప్పారు. ఇక ఐఐటీల్లో ప్రస్తుతం 8 శాతం ఉన్నమహిళల సంఖ్య 2022లో 20 శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వజీత్ ప్రాజెక్టు, ఉచ్చాతర్ అవిష్కార్ పథకంతో ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధన విభాగాలను పటిష్టం చేస్తున్నామని ఈ సందర్భంగా జవదేకర్ తెలిపారు.