వంగ తీర్చు లాభాల బెంగ
విత్తే సమయం: వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలాల్లో వంగ నారు కోసం విత్తుకోవచ్చు. వర్షాకాలంలో జూలై నెల వరకు పోసిన 30-35 రోజుల నారును ప్రస్తుతం నాటుకోవచ్చు. అక్టోబర్, నవంబర్ నెలల్లో పోసిన నారును నవంబర్, డిసెంబర్ నెలల్లో, జనవరి, ఫిబ్రవరిలో పోసిన నారును ఫిబ్రవరి, మార్చి మొదటివారం వరకు నాటుకోవచ్చు.
నేలలు: బాగా నీరు ఇంకే నేలలు, ఒక మాదిరి నుంచి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. చౌడు నేలలు పనికి రావు.
విత్తనం: ఎకరాకు సూటి రకాలైతే 260 గ్రాములు, సంకర జాతి రకాలు120 గ్రాములు సరిపోతాయి.
రకాలు: పూసా క్రాంతి, పూసా పర్పుల్ క్లష్టర్, శ్యామల రకాలు జిల్లాలో అనువైన సాగు రకాలు.
నేల తయారీ: నేలను 4-5 సార్లు బాగా దున్ని చదును చేయాలి. వర్షాకాలపు పంటకు బోదెలు, కాలువలు ఏర్పాటు చేయాలి. శీతాకాలం, వేసవి పంటకు 4ఁ5 చ.మీ మళ్లను తయారు చేసుకోవాలి.
నారుమడి పెంపకం: కోకోపిట్‌తో నింపిన ప్రోటేస్ వాడి నారు పెంచాలి. దీని వల్ల విత్తన పరిమాణం తక్కువ పడుతుంది. ప్రధాన పొలంలో నాటుకునే విధంగా నారు వృద్ధి చెందుతుంది. ఎకరాకు 100 ప్రోటేస్ అవసరం.
నాటే దూరం: వరుసకు వరుసకు 60 సెం.మీ, పాదుకు పాదుకు 60 సెం.మీ ఎడం పాటించాలి.
ఎరువులు: బాగా చీకిన పశువుల ఎరువు ఎకరానికి 6-8 టన్నుల వరకు వేసుకోవాలి. ఇదిగాక 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్, 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు వేయాలి. నత్రజనిని నాటేటప్పుడు సగం, నాటిన 30 రోజులకు మిగతా సగం వేసుకోవాలి.
అంతరకృషి: కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు తీసివేయాలి. మొక్కలు బలంగా పెరగటానికి 2-3 తడుల తర్వాత ఒకటి, రెండు సార్లు మట్టిని తేలికగా గుల్ల పరచాలి.
నీటి యాజమాన్యం: గింజలు విత్తగానే నీరు పారించాలి. మూడోరోజు మరలా ఇవ్వాలి. త రువాత ప్రతి 7-10 రోజులకు నీటి తడులివ్వాలి. డ్రిప్ విధానంలోనూ నీరు ఇవ్వవచ్చు.
సస్యరక్షణ
మొవ్వ, కాయతొలుచు పురుగు: నాటిన 30-40 రోజుల నుండి ఈ పురుగు ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వను, కాయలను తొలిచి నష్టాన్ని కలిగిస్తాయి. కాయలు వకర్లు తిరిగి పోతాయి. పెరుగుదల ఆగిపోతుంది. ని వారణకు పురుగు ఆశించిన కొమ్మల చివర్లను తుంచి నాశనం చేయాలి. కార్బరిల్ 50 శాతం డబ్ల్యూపీ మూడు గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లేదా సైపర్ మెత్రిన్ ఒక మి.లీ లీటర్ నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తరువాత పిచికారీ చేయాలి.
ఆకుమాడు, కాయకుళ్లు తెగులు: ఆకులపై గోధుమ రంగుతో కూడిన మచ్చలు కనిపిస్తాయి. తెగులు సోకిన కాయలు పసుపు రంగుకు మారి కుళ్లి పోతాయి. దీని నివారణకు విత్తనాలను 50 డిగ్రీల ఉష్ణోగ్రత గల నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టి విత్తుకోవాలి. తెగులు ఆశించిన పొలంలో పంట మార్పిడి తప్పని సరిగా పాటించాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటిలో మూడు గ్రాముల చొప్పున కలిపి పైరుపై పది రోజుల వ్యవధిలో 2-3 సార్లు ఉదయం లేదా సాయంత్రం పిచికారీ చేయాలి.
వెర్రి తెగులు: ఆకులు సన్నగా, పాలిపోయి ఉంటాయి. మొక్కలు గుబురుగా, చీపురు కట్టలా కనబడతాయి. పూత, కాత లేకుండా గొడ్డుబారి పోతాయి. ఇది వైరస్ తెగులు ఈ వైరస్‌ను పచ్చదోమ వ్యాపింపజేస్తుంది. మిథైల్ డెమటాస్ రెండు మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఆశించిన మొక్కలను గుర్తించి ఎప్పటికప్పుడు నాశనం చేయాలి. నారుమడి దశలో నాటటానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలు 100 చ.మీ నారుమడికి వేయాలి. నాటిన తరువాత ఎకరాకు 8 కిలోల చొప్పున కూడా గుళికలు వేయాలి. నారు వేళ్లను 1000 పీపీఎం టెట్రాసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటుకోవాలి. నాటిన 4-5 వారాలకు రోగార్ లేదా మిథైల్ డెమటాన్ 2 మి.లీ లీటర్ నీటికి కలిపి మూడుసార్లు పిచికారీ చేయాలి.
సమగ్ర సస్య రక్షణ: పురుగు ఆశించిన కాయ లు, కొమ్మలను తుంచి నాశనం చేయాలి. అం తరపంటగా బంతి, ఉల్లి, వెల్లుల్లి, పంటలను వేసుకోవాలి. లింగాకర్షక బుట్టలు ఎకరాకు నాలుగు చొప్పున పెట్టాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున విడుదల చేయాలి. ట్రైకోగ్రామా బదనికలను విడుదల చేయాలి. ఎకరాకు 200 కిలోల వేపపిండిని దుక్కిలో వేయాలి.
ట్రైకోడెర్మా విరిడి కల్చర్‌ను ఎకరాకు 2-3 కిలోల చొప్పున దుక్కిలో వాడాలి. రసం పీల్చు పురుగు ఆశించకుండా ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకోవాలి. పంట పూత, కాత దశలో నఫ్తలీన్ ఆసిటికామ్లం ఒక మి.లీ నాలుగు లీటర్ల నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే 15-20 శాతం అధికోత్పత్తి పొందవచ్చు.