cancer research
-
కేన్సర్‌పై పరిశోధనకు ‘ఈపీఆర్ జీన్ టెక్నాలజీ’
సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌పై పరిశోధన, మందుల తయారీవంటి అంశాలపై ‘ఈపీఆర్ జీన్ టెక్నాలజీ’కంపెనీ ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో రీసెర్చి ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) ఆధ్వర్యంలో మంగళవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో జరిగిన ఒక కార్యక్రమంలో పలు కంపెనీలను ఎంపిక చేశారు. కేన్సర్‌పై పరిశోధన, దాని నివారణకు ‘రిచ్’ఆహ్వానం మేరకు 60 కంపెనీలు ప్రతిపాదనలు పంపించాయి. అందులో ఆరింటిని తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ఈపీఆర్ జీన్ టెక్నాలజీ ఒకటి. ఈపీఆర్ జీన్ టెక్నాలజీ ఇప్పటికే కేన్సర్‌పై పరిశోధన పూర్తి చేసింది. అందుకుగాను ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు బహూకరించింది. అవార్డును సైంటిఫిక్ అడ్వైజర్‌గా ఉన్న ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే తాము అమెరికాలోనూ, ఇండియాలోనూ కేన్సర్ నివారణకు పరిశోధనలు పూర్తి చేసి మందును కనుగొన్నామన్నారు. ఈ మందుకు రెండు దేశాల్లోనూ అనుమతి కావాల్సి ఉందని, క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. అలాగే మందు తయారీకి భారత్‌లో అనుమతి కూడా అవసరమన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభు త్వం తమ కంపెనీ ప్రతిపాదనను ఎంపిక చేయ డం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. -
ఇలా చేస్తే క్యాన్సర్‌కు చెక్
లండన్: ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలితీసుకుంటున్న మహమ్మారి క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసేందుకు జరుగుతున్న పరిశోధనలు ఎలా ఉన్నా దాని నియంత్రణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కొన్ని ఆహార పదార్ధాలు తీసుకుంటే క్యాన్సర్‌కు దూరంగా ఉండవచ్చనే అంచనాల్లో వాస్తవం ఎంత..? అసలు క్యాన్సర్ ముప్పును తప్పించుకునేందుకు ఏ ఆహారం తీసుకోవాలి.. ఏ ఆహారాన్ని విడిచిపెట్టాలనేదానిపై క్యాన్సర్ రీసెర్చి యూకే కీలక అంశాలను వెల్లడించింది.ఇప్పటివరకూ క్యాన్సర్ అంటే జన్యుపరమైన అంశాలు, దురదృష్టం, విధిరాత అంటూ సమాధానపరుచుకుంటున్న క్రమంలో తాజా అథ్యయనం క్యాన్సర్‌కు జన్యుపరమైన అంశాలతో పాటు పర్యావరణం, జీవనశైలి ప్రధాన కారణమని తేల్చింది. అల్రా్ట వైలట్ కిరణాలు వంటి పర్యావరణ అంశాలు, జీవనశైలి, పొగాకులో ఉండే క్యాన్సర్ కారక కెమికల్స్ వంటివి మానవ డీఎన్ఏను విచ్ఛిన్నం చేయడం ద్వారా క్యాన్సర్ ప్రబలుతుందని తెలిపింది. క్యాన్సర్ కణాలు క్రమంగా పెరుగుతూ డీఎన్ఏకు తీవ్ర నష్టం వాటిల్లచేస్తూ శరీరాన్ని ధ్వంసం చేస్తాయని విశ్లేషించింది. క్యాన్సర్‌కు చెక్ పెట్టేందుకు సూపర్ ఫుడ్స్ అంటూ ఏమీ ఉండవని, ఆరోగ్యకర ఆహారం తీసుకుంటే మేలని తెలిపింది. ఒకే రకమైన కూరగాయలను తీసుకోవడం కన్నా తాజా పండ్లు, సీజనల్ కూరగాయలన్నింటినీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించింది. మొబైల్‌తో ముప్పు లేదు... మొబైల్ ఫోన్‌తో అదే పనిగా ముచ్చటించడం, ఛాటింగ్‌తో బ్రైన్ ట్యూమర్ వస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని తాజా అథ్యయనం తేల్చింది. 1998 నుంచి మొబైల్ వాడకం విపరీతంగా పెరిగినా బ్రెయిన్ ట్యూమర్ కేసుల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోకపోవడాన్ని ఈ అథ్యయనం ప్రస్తావించింది.19 రకాల క్యాన్సర్లకు మొబైల్ ఫోన్ వాడకానికి ఎలాంటి లింక్ లేదని ఇటీవల ఓ భారీ అథ్యయనంలో నిగ్గుతేలిందని పేర్కొంది. మరోవైపు బ్రా వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందనే వాదననూ కొట్టిపారేసింది. ఆల్కహాల్, ఊబకాయంతో రిస్క్ మద్యం సేవించడం క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతుందని తెలిపింది. నోటి, గొంతు, జీర్ణాశయ క్యాన్సర్లకు ఆల్కహాల్ సేవనం దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పొగతాగడం, ఆల్కహాల్ రెండూ ఒకేసారి చేస్తే క్యాన్సర్ రిస్క్ మరింత అధికంగా ఉంటుందని తెలిపింది. ఇక ఊబకాయం కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతుందని హెచ్చరించింది. -
ఎక్సర్‌సైజ్‌తో క్యాన్సర్ మటుమాయం
అథ్లెట్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువన్న విషయాన్ని పలువురు శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చిచెప్పారు. అందుకు కారణం వారు సరైన పోషక పదార్థాలు తీసుకోవడం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం, ధూమపానం లాంటి దురలవాట్లు లేకపోవడమేనని భావిస్తూ వచ్చారు. అయితే.. శరీర వ్యాయామానికి, క్యాన్సర్ రాకపోవడానికి ఉన్న సంబంధం ఏంటో మాత్రం వారు విడమరచి చెప్పలేకపోయారు. శరీర వ్యాయామానికి, క్యాన్సర్ రాకపోవడానికి కారణాలు ఏంటో తాజాగా శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. కోపెన్‌హాగెన్ యూనివర్సిటీ ఆస్పత్రికి చెందిన వైద్యనిపుణులు ఎంపికచేసిన ఆరు ఎలుకల్లోకి క్యాన్సర్ కణాలను ఎక్కించారు. వాటిలో మూడింటిని బోనులో బంధించారు. మరో మూడింటిని స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు. కొన్ని నెలల తర్వాత వాటిని పరీక్షించి చూడగా, బోనులో బంధించిన మూడు ఎలుకల్లోనూ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందాయి. స్వేచ్ఛగా వదిలేసిన మూడు ఎలుకల్లో ఒకదానిలో మాత్రమే క్యాన్సర్ కణితి ఏర్పడింది. అదికూడా బోనులో బంధించిన ఎలుకల క్యాన్సర్ కణుతుల కన్నా చిన్నగా ఉంది. ఈ ప్రయోగం ద్వారా వ్యాయామం చేయడంతో క్యాన్సర్ వచ్చే ముప్పును దాదాపు తప్పించుకోవచ్చని తేలింది. క్యాన్సర్‌కు, వ్యాయామానికి ఉన్న ప్రత్యక్ష సంబంధం ఏంటన్న అంశంపై కూడా శాస్త్రవేత్తలు అధ్యయనాలు జరిపారు. బ్రిటన్‌లోని చారిటీ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, ప్రాథమిక దశలో క్యాన్సర్ ఉన్న 50 మందిని ఎంపిక చేసి వారితో వారానికి రెండున్నర గంటల చొప్పున 12 నెలలపాటు వ్యాయామం చేయించింది. వారిలో గణనీయంగా క్యాన్సర్ తగ్గిపోయింది. వ్యాయామం చేయడం వల్ల ఆడ్రినలైన్ అనే హార్మోన్, ఇంటర్‌లుకిన్ అనే ప్రోటీన్ బాడీలో విడుదలవుతుంది. ఈ రెండు కూడా క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. క్యాన్సర్ నివారణ మందుల్లోనూ ఇప్పుడు వీటిని వాడుతున్నారు. ఈ మందులు అవసరం లేకుండా క్యాన్సర్‌ను నిరోధించేందుకు వ్యాయామం చేయడమే ఉత్తమమైన మార్గమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అడ్రినలిన్, ఇంటర్‌లుకిన్ మందుల వల్ల శరీరంలో మంట పుడుతుందని, ఆది కొన్ని సందర్భాల్లో బాధగాను ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల ఈ మంట శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుందని వారు చెబుతున్నారు. ఏ మాత్రం వ్యాయామం చేయలేని వారే మందులు వాడాలని, వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలు, బ్రెస్ట్, అండాశయం, సర్వికల్ క్యాన్సర్లను సులభంగానే ఎదుర్కోవచ్చని వారంటున్నారు. వ్యాయామం అంటే అథ్లెట్లలా చేయాల్సిన అవసరం లేదని, వారానికి మూడు గంటలు చేస్తే సరిపోతుందని వారు చెబుతున్నారు. వ్యాయామం చేయడం ద్వారానే క్రికెట్ ఆటగాడు యువరాజ్ సింగ్, బాలీవుడ్ తార మనిషా కొయిరాలా తదితరులు క్యాన్సర్‌ను జయంచిన విషయం తెల్సిందే.