ఎక్సర్‌సైజ్‌తో క్యాన్సర్ మటుమాయం
అథ్లెట్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువన్న విషయాన్ని పలువురు శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చిచెప్పారు. అందుకు కారణం వారు సరైన పోషక పదార్థాలు తీసుకోవడం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం, ధూమపానం లాంటి దురలవాట్లు లేకపోవడమేనని భావిస్తూ వచ్చారు. అయితే.. శరీర వ్యాయామానికి, క్యాన్సర్ రాకపోవడానికి ఉన్న సంబంధం ఏంటో మాత్రం వారు విడమరచి చెప్పలేకపోయారు.
శరీర వ్యాయామానికి, క్యాన్సర్ రాకపోవడానికి కారణాలు ఏంటో తాజాగా శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. కోపెన్‌హాగెన్ యూనివర్సిటీ ఆస్పత్రికి చెందిన వైద్యనిపుణులు ఎంపికచేసిన ఆరు ఎలుకల్లోకి క్యాన్సర్ కణాలను ఎక్కించారు. వాటిలో మూడింటిని బోనులో బంధించారు. మరో మూడింటిని స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు. కొన్ని నెలల తర్వాత వాటిని పరీక్షించి చూడగా, బోనులో బంధించిన మూడు ఎలుకల్లోనూ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందాయి. స్వేచ్ఛగా వదిలేసిన మూడు ఎలుకల్లో ఒకదానిలో మాత్రమే క్యాన్సర్ కణితి ఏర్పడింది. అదికూడా బోనులో బంధించిన ఎలుకల క్యాన్సర్ కణుతుల కన్నా చిన్నగా ఉంది. ఈ ప్రయోగం ద్వారా వ్యాయామం చేయడంతో క్యాన్సర్ వచ్చే ముప్పును దాదాపు తప్పించుకోవచ్చని తేలింది.
క్యాన్సర్‌కు, వ్యాయామానికి ఉన్న ప్రత్యక్ష సంబంధం ఏంటన్న అంశంపై కూడా శాస్త్రవేత్తలు అధ్యయనాలు జరిపారు. బ్రిటన్‌లోని చారిటీ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, ప్రాథమిక దశలో క్యాన్సర్ ఉన్న 50 మందిని ఎంపిక చేసి వారితో వారానికి రెండున్నర గంటల చొప్పున 12 నెలలపాటు వ్యాయామం చేయించింది. వారిలో గణనీయంగా క్యాన్సర్ తగ్గిపోయింది. వ్యాయామం చేయడం వల్ల ఆడ్రినలైన్ అనే హార్మోన్, ఇంటర్‌లుకిన్ అనే ప్రోటీన్ బాడీలో విడుదలవుతుంది. ఈ రెండు కూడా క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. క్యాన్సర్ నివారణ మందుల్లోనూ ఇప్పుడు వీటిని వాడుతున్నారు.
ఈ మందులు అవసరం లేకుండా క్యాన్సర్‌ను నిరోధించేందుకు వ్యాయామం చేయడమే ఉత్తమమైన మార్గమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అడ్రినలిన్, ఇంటర్‌లుకిన్ మందుల వల్ల శరీరంలో మంట పుడుతుందని, ఆది కొన్ని సందర్భాల్లో బాధగాను ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల ఈ మంట శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుందని వారు చెబుతున్నారు. ఏ మాత్రం వ్యాయామం చేయలేని వారే మందులు వాడాలని, వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలు, బ్రెస్ట్, అండాశయం, సర్వికల్ క్యాన్సర్లను సులభంగానే ఎదుర్కోవచ్చని వారంటున్నారు. వ్యాయామం అంటే అథ్లెట్లలా చేయాల్సిన అవసరం లేదని, వారానికి మూడు గంటలు చేస్తే సరిపోతుందని వారు చెబుతున్నారు. వ్యాయామం చేయడం ద్వారానే క్రికెట్ ఆటగాడు యువరాజ్ సింగ్, బాలీవుడ్ తార మనిషా కొయిరాలా తదితరులు క్యాన్సర్‌ను జయంచిన విషయం తెల్సిందే.