లండన్: ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలితీసుకుంటున్న మహమ్మారి క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసేందుకు జరుగుతున్న పరిశోధనలు ఎలా ఉన్నా దాని నియంత్రణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కొన్ని ఆహార పదార్ధాలు తీసుకుంటే క్యాన్సర్‌కు దూరంగా ఉండవచ్చనే అంచనాల్లో వాస్తవం ఎంత..? అసలు క్యాన్సర్ ముప్పును తప్పించుకునేందుకు ఏ ఆహారం తీసుకోవాలి.. ఏ ఆహారాన్ని విడిచిపెట్టాలనేదానిపై క్యాన్సర్ రీసెర్చి యూకే కీలక అంశాలను వెల్లడించింది.ఇప్పటివరకూ క్యాన్సర్ అంటే జన్యుపరమైన అంశాలు, దురదృష్టం, విధిరాత అంటూ సమాధానపరుచుకుంటున్న క్రమంలో తాజా అథ్యయనం క్యాన్సర్‌కు జన్యుపరమైన అంశాలతో పాటు పర్యావరణం, జీవనశైలి ప్రధాన కారణమని తేల్చింది. అల్రా‍్ట వైలట్ కిరణాలు వంటి పర్యావరణ అంశాలు, జీవనశైలి, పొగాకులో ఉండే క్యాన్సర్ కారక కెమికల్స్ వంటివి మానవ డీఎన్‌ఏను విచ్ఛిన్నం చేయడం ద్వారా క్యాన్సర్ ప్రబలుతుందని తెలిపింది.
క్యాన్సర్ కణాలు క్రమంగా పెరుగుతూ డీఎన్‌ఏకు తీవ్ర నష్టం వాటిల్లచేస్తూ శరీరాన్ని ధ్వంసం చేస్తాయని విశ్లేషించింది. క్యాన్సర్‌కు చెక్ పెట్టేందుకు సూపర్ ఫుడ్స్ అంటూ ఏమీ ఉండవని, ఆరోగ్యకర ఆహారం తీసుకుంటే మేలని తెలిపింది. ఒకే రకమైన కూరగాయలను తీసుకోవడం కన్నా తాజా పండ్లు, సీజనల్ కూరగాయలన్నింటినీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించింది.
మొబైల్‌తో ముప్పు లేదు...
మొబైల్ ఫోన్‌తో అదే పనిగా ముచ్చటించడం, ఛాటింగ్‌తో బ్రైన్ ట్యూమర్ వస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని తాజా అథ్యయనం తేల్చింది. 1998 నుంచి మొబైల్ వాడకం విపరీతంగా పెరిగినా బ్రెయిన్ ట్యూమర్ కేసుల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోకపోవడాన్ని ఈ అథ్యయనం ప్రస్తావించింది.19 రకాల క్యాన్సర్లకు మొబైల్ ఫోన్ వాడకానికి ఎలాంటి లింక్ లేదని ఇటీవల ఓ భారీ అథ్యయనంలో నిగ్గుతేలిందని పేర్కొంది. మరోవైపు బ్రా వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందనే వాదననూ కొట్టిపారేసింది.
ఆల్కహాల్, ఊబకాయంతో రిస్క్
మద్యం సేవించడం క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతుందని తెలిపింది. నోటి, గొంతు, జీర్ణాశయ క్యాన్సర్లకు ఆల్కహాల్ సేవనం దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పొగతాగడం, ఆల్కహాల్ రెండూ ఒకేసారి చేస్తే క్యాన్సర్ రిస్క్ మరింత అధికంగా ఉంటుందని తెలిపింది. ఇక ఊబకాయం కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతుందని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment