చెట్టెక్కితేనే.. రేషన్ బియ్యం!
ప్రజా పంపిణీకి సెల్ సిగ్నల్స్‌తో షాక్
- సిగ్నల్స్ సరిగా అందక పనిచేయని ఈ–పాస్ యంత్రాలు
- వేలిముద్ర వెరిఫై అయ్యాకే సరుకులు ఇవ్వాల్సిన పరిస్థితి
- సిగ్నల్ కోసం గుట్టలు, చెట్లు ఎక్కుతున్న డీలర్లు
సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా అమల్లోకి తెచ్చిన ఆధునిక టెక్నాలజీ రేషన్ డీలర్లను చెట్లు, గుట్టలు ఎక్కిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఈ–పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్) యంత్రాలకు సెల్ సిగ్నల్స్ అందక తీవ్ర ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సిగ్నల్ కోసం చెట్లు, పుట్టలు పట్టుకుని తిరగడం, ఇళ్లు, భవనాలపైకి ఎక్కడం, గ్రామాల సమీపంలోని గుట్టలపైకి వెళ్లాల్సి రావడం వంటి వాటితో.. అటు రేషన్ డీలర్లకు, ఇటు లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఈ–పాస్‌కు సెల్ సిగ్నల్ షాక్
ఈ–పాస్ యంత్రాలు సెల్‌ఫోన్ టెక్నాలజీ (సిమ్‌కార్డు) ఆధారంగా పనిచేస్తున్నాయి. అన్ని లావాదేవీలను ఆన్లైన్లో నమోదు చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి.. రేషన్ దుకాణాలను దానికి అనుసంధానం చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో సెల్ సిగ్నల్ సరిగా లేకపోవడం కారణంగా ఈ–పాస్ యంత్రాల వినియోగం సమస్యాత్మకంగా మారింది. మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో పరిశీలించినప్పుడు... గండేడు, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సిపాయిగూడెం, బండలేమూరు, చెన్నారెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండలంలో సిగ్నల్ సమస్య తలెత్తింది. దీంతో బయోమెట్రిక్ వివరాలు వెరిఫై చేయలేక.. రేషన్ డీలర్లు లబ్ధిదారులకు సరిగా సరుకులు పంపిణీ చేయలేకపోతున్నారు.
సరుకులు, యంత్రాలు తీసుకుని.. సెల్ సిగ్నల్ కోసం ఎత్తయిన చోట్లకు వెళుతున్నారు. ఇళ్లపైకి, చెట్లపైకి ఎక్కడం, కొన్ని చోట్ల సమీపంలోని గుట్టలు ఎక్కడం వంటివి చేయాల్సి వస్తోంది. అటు లబ్ధిదారులు కూడా సరుకుల కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఇక ఈ–పాస్ యంత్రాలు తరచూ స్విచాఫ్ కావడం, సిగ్నల్స్ సరిగా లేక సాంకేతిక లోపంతో తూనికల యంత్రాలు సరిగా పనిచేయక ఇబ్బందులు వస్తున్నాయి.
అక్రమాలకు అడ్డుకట్ట పడుతున్నా..
అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, బినామీ లబ్ధిదారులను ఏరివేయడం లక్ష్యంగా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రేషన్ షాపుల్లో ఈ–పాస్ యంత్రాలను ఏర్పాటు చేస్తోంది. వాటితో అర్హులైన లబ్ధిదారుల వేలిముద్రను సరిచూసుకుని మాత్రమే సరుకులను అందజేయాల్సి ఉంటుంది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 1,545 రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేసి.. ఈ–పాస్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. కేవలం 15 నెలల కాలంలో ప్రభుత్వానికి ఏకంగా రూ.320 కోట్లు ఆదా అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 800 రేషన్ షాపుల్లో అమలు చేయగా.. నెల రోజుల్లోనే రూ.3.3 కోట్లు భారం తగ్గింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 17,200 రేషన్ షాపుల్లో ఈ–పాస్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బయోమెట్రిక్‌తోపాటు ఐరిస్ స్కానింగ్ సౌలభ్యం కూడా ఉండేలా అధునాతన యంత్రాలను తెప్పించి.. దశలవారీగా ఏర్పాటు చేస్తోంది.
టెలికాం కంపెనీల దృష్టికి సమస్య
పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు సెల్ సిగ్నల్ సమస్యను సంబంధిత కంపెనీల దృష్టికి తీసుకెళ్లారు. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా తదితర ఆపరేటర్ల ప్రతినిధులను పిలిపించి నెట్వర్క్ విషయంలో జాగ్ర త్తలు తీసుకోవాలని కోరినట్లు తెలిపాయి. అయితే సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికే రాష్ట్రవ్యాప్తంగా 10 వేల రేషన్ షాపుల్లో ఈ–పాస్ అమల్లోకి రానుంది. మిగతా 7,200 షాపుల్లో దశల వారీగా ఏర్పాటు చేయనున్నారు.
పని మానుకుని తిరుగుతున్నం..
రేషన్ సరుకులు తీసుకోవడానికి కూలీ పనులు, వ్యవసాయ పనులు మానుకుని తిరగాల్సి వస్తోంది. వారం రోజుల నుంచి వచ్చి పోతున్నా వేలిముద్రలు రాక సరుకులు ఇవ్వడం లేదు.
– నీలి గంగమ్మ, గాధిర్యాల్
రోజుల కొద్దీ మిషన్లు పనిచేయడం లేదు
రేషన్ సరుకులు తీసుకోవడానికి మిషన్లు పెట్టడంతో దూర ప్రాంతాల్లో పనులకు వెళ్లినవారు కూడా నెలకోసారి ఊరికి వచ్చిపోవాల్సి వస్తోంది. ముంబై, పుణెలకు వలస పోయినోళ్లూ వచ్చిపోతున్నరు. ఇక్కడ గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల కొద్దీ మిషన్లు పనిచేయక.. సరుకులు తీసుకోవడం కష్టమవుతోంది.
– లక్ష్మీబాయి, మొకర్లాబాద్ తండా
సరుకుల పంపిణీ కష్టంగా మారింది
రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఈ–పాస్ మిషన్లు పెట్టడం మంచిదే అయినా.. మారుమూల ప్రాంతాల్లో సెల్ సిగ్నల్ రాక సమస్యలు వస్తున్నాయి. నా రేషన్ షాపు పరిధిలో 460 కార్డులుండగా.. ఇదివరకు వారంలో సరుకుల పంపిణీ పూర్తయ్యేది. ఈ–పాస్ మిషన్లు వచ్చాక.. 20 రోజుల పాటు పనిచేయాల్సి వస్తోంది. ఈ విషయమై సర్కార్ దృష్టి పెట్టాలి’’
– గోపాల్‌నాయక్, మంగంపేట రేషన్ డీలర్