భవిష్యత్‌ను తీర్చిదిద్దుకొనేదిలా!
హైదరాబాద్: నేటి తరం విద్యార్థుల్లో మెళకువలు, నైపుణ్యాలు కొరవడుతున్నాయి. ఉన్నత విద్య అభ్యసించినా సరైన ఉద్యోగావకాశాలు అందుకోలేకపోతున్నారు. తాము చదివిన చదువుకు సంబంధం లేని కొలువులు చేస్తూ అరకొర వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకొందరు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. వారిని సరైన మార్గనిర్దేశం లేకపోవడం వల్లే కెరీర్ పరుగులో వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి పాఠశాల స్థాయి నుంచే అకడమిక్ కెరీర్ ప్లానింగ్‌పై అవగాహన కల్పించే నూతన కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ ఇటీవల చేపట్టింది. సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ లెర్నింగ్(సీఎఫ్‌ఐఎల్) సహకారంతో ప్రయోగాత్మకంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీన్ని ఇతర జిల్లాల్లోనూ కొనసాగించాలని అధికారులు యోచిస్తున్నారు.
ఎటు వెళ్లాలి? ఏం చేయాలి?
సీఎఫ్‌ఐఎల్ అధ్యయనం ప్రకారం.. అకడమిక్ కెరీర్ ప్లానింగ్, మార్గనిర్దేశం లేకపోవడం వల్ల విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తిచేసినప్పటికీ తాము ఎటువైపు వెళ్లాలో, ఏం చేయాలో అర్థంకాని అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం వారు నిర్ణీత నైపుణ్యాలను అలవర్చుకోలేకపోవడమే. సీఎఫ్‌ఐఎల్ గణాంకాల ప్రకారం.. ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారిలో 83 శాతం మంది నిరుద్యోగులుగా ఉంటున్నారు. కొందరు నెలకు రూ.5 వేల జీతంతో తమ చదువులకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అటెండర్, క్లర్క్ వంటి కిందిస్థాయి ఉద్యోగాలకూ వేలల్లో దరఖాస్తులు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఏటేటా పెరుగుతున్నట్లు సీఎఫ్‌ఐఎల్ అధ్యయనంలో తేలింది. ఈ పరిస్థితిని మార్చాలంటే పాఠశాల స్థాయి నుంచే అకడమిక్ కెరీర్ ప్లానింగ్‌పై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నది విద్యాశాఖ ఉద్దేశం.
పదో తరగతి తరువాత కోర్సులెన్నో...
అకడమిక్ కెరీర్ కౌన్సెలింగ్‌లో భాగంగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రికార్డు చేయిస్తూ దాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తారు. ఆయా విద్యార్థులు ఏయే అంశాల్లో పరిణతి కనబరుస్తున్నారు? వారిలో ఎలాంటి సృజనాత్మక శక్తి ఉంది? వంటి అంశాలను లోతుగా పరిశీలిస్తారు. తద్వారా పదో తరగతి తరువాత వారు ఏ కోర్సులను ఎంచుకొంటే అద్భుతంగా రాణిస్తారో సూచిస్తారు. ప్రస్తుతం విద్యార్థుల్లో అవగాహన కొరవడడం వల్ల తమ అభిరుచికి తగని కోర్సుల్లో చేరుతూ మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. పదో తరగతి తరువాత వివిధ రంగాలకు సంబంధించి వందలాది కోర్సులున్నా వాటి గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియడం లేదు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి కనీస అవగాహన కూడా ఉండడం లేదు. అకడమిక్ కెరీర్ కౌన్సెలింగ్‌లో పదో తరగతి తరువాత అందుబాటులో ఉన్న కోర్సులు, వాటిని అభ్యసిస్తే లభించే ఉద్యోగావకాశాల గురించి తెలియజేస్తారు. విద్యార్థుల అభీష్టాన్ని అనుసరించి దేనిలో చేరితే కెరీర్ బాగుంటుందో మార్గనిర్దేశం చేస్తారు. ముందుగా ప్రధానోపాధ్యాయులకు దీనిపై శిక్షణ ఇస్తారు. అనంతరం స్కూళ్లవారీగా విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తారు.