CHINTALAPUDI LIFT IRRIGATION
-
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పునః ప్రారంభం
-
మెట్ట కష్టాలు గట్టెక్కేలా..
సాక్షి, అమరావతి: మెట్ట ప్రాంత సాగునీటి కష్టాలను గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2022 నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షల ఎకరాలు, కృష్ణా జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని 2.80 లక్షల ఎకరాలు వెరసి మొత్తం 4.80 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ప్రణాళికతో వడివడిగా అడుగులు వేస్తోంది. సమీపాన గోదావరి నదిలో వరద వెల్లువెత్తుతున్న సమయంలోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంత భూములకు సాగునీరు.. ప్రజల తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. సముద్రం పాలవుతున్న గోదావరి వరద జలాలను ఒడిసిపట్టి ఈ గడ్డు పరిస్థితులను అధిగమించే చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. మరో రూ.1,778 కోట్లతో పూర్తి చేసేలా.. పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు అక్కడి ప్రజల దాహార్తిని తీర్చడం, సాగర్ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో జలవనరుల శాఖ చేర్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 23 నెలల్లోనే ఈ పనులకు రూ.875.12 కోట్లను ఖర్చు చేశారు. మరో రూ.1,778 కోట్లను వెచ్చించడం ద్వారా ఈ పథకాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ స్వరూపమిలా గోదావరి నుంచి రోజుకు 6,870 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 53.50 టీఎంసీలను ఎత్తిపోస్తారు. ఆ నీటిని నిల్వ చేయడానికి 8 టీఎంసీల సామర్థ్యంతో జల్లేరు రిజర్వాయర్ నిర్మించాలని తొలుత నిర్ణయించారు. అయితే, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో 4.80 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి అది సరిపోదని నీటి పారుదల నిపుణులు తేల్చారు. దీంతో రిజర్వాయర్ సామర్థ్యాన్ని 14 టీఎంసీలకు పెంచారు. 2022 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అంచనా వ్యయం రూ.5,532 కోట్లు.. ఇప్పటివరకు రూ.3,754 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మరో రూ.1778 కోట్ల విలువైన మిగిలాయి. రెండో దశ పనులు కొలిక్కి.. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో తొలి దశ పనులు అంటే.. గోదావరి వద్ద పంప్ హౌస్, 36 కి.మీ. పొడవున ప్రధాన కాలువ తవ్వకం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రెండో దశలో 68 కి.మీ. పొడవున ప్రధాన కాలువ తవ్వకం పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. పంప్ హౌస్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 నుంచి 14 టీఎంసీలకు పెంచడం వల్ల 1,700 హెక్టార్లు ముంపునకు గురవుతుంది. ఇందుకు అవసరమైన భూసేకరణ కోసం ఇప్పటికే తొలి దశ అనుమతులను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జారీ చేసింది. ముంపునకు గురయ్యే భూమికి బదులుగా అనంతపురం జిల్లాలో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి కేటాయించిన భూమిని అటవీ శాఖకు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ భూమిని అప్పగించడంతోపాటు అటవీ శాఖకు నష్టపరిహారం చెల్లించడం ద్వారా రెండో దశ అటవీ అనుమతులను సాధించి, జల్లేరు రిజర్వాయర్ పనులకు మార్గం సుగమం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓ వైపు జల్లేరు రిజర్వాయర్ నిర్మాణ పనులను చేపడుతూనే.. మరోవైపు ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించింది. గడువులోగా చేస్తాం చింతలపూడి ఎత్తిపోతలను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తాం. తొలి దశ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రెండో దశ పనులు శరవేగంగా చేస్తున్నాం. జల్లేరులో ముంపునకు గురయ్యే భూమికి బదులుగా అనంతపురం జిల్లాలో ఏపీఐఐసీకి కేటాయించిన భూమిని అటవీశాఖకు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రెండో దశ అటవీ అనుమతులు సాధించి జల్లేరు రిజర్వాయర్ పనులు చేస్తూనే.. ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందించాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్ -
చింతలపూడి ఎత్తిపోతల్లో చిలక్కొట్టుడు
సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నానుడిని ఒంటబట్టించుకున్న సీఎం చంద్రబాబు అధికారాంతాన కూడా దొరికినంత దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలు పూర్తయ్యాయి. 23న ఫలితాలు రానున్నాయి. ఈ లోపు అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఆయన వదలడం లేదు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు సంబంధించి రూ.1182 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అస్మదీయునికి కట్టబెట్టడం ద్వారా రూ.వంద కోట్లను కమీషన్‌గా వసూలు చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రూ.563.40 కోట్ల పనులను నామినేషన్ పద్ధతిలో.. గోదావరికి వరద వచ్చే 90 రోజుల్లో రోజుకు 56 క్యూసెక్కుల చొప్పున 20 టీఎంసీలు తరలించి.. పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు రూ.1701 కోట్లతో చింతలపూడి ఎత్తిపోతలను 2009లో చేపట్టారు. ఈ పనులను అప్పట్లోనే కాంట్రాక్టర్లకు అప్పగించారు. టీడీపీ సర్కార్ వచ్చాక చింతలపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచింది. రోజుకు 194.53 క్యూసెక్కుల చొప్పున 53.5 టీఎంసీలు తరలించి.. అదనంగా నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 నుంచి 20 టీఎంసీలకు పెంచాలని ప్రతిపాదించారు. సామర్థ్యం పెంచడం వల్ల కొత్తగా చేపట్టాల్సిన పనులను 2 ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. పాత కాంట్రాక్టర్లకు రెండు ప్యాకేజీల కింద రూ.563.40 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించి.. రూ.50 కోట్లకుపైగా ఇప్పటికే కమీషన్లు వసూలు చేసుకున్నారు. రిజర్వాయర్ పనుల నిర్మాణ వ్యయం రూ.1182 కోట్లు జల్లేరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 8 నుంచి 20 టీఎంసీలకు పెంచే పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీ బాధ్యతలను ఏడాది క్రితం కాంట్రాక్టర్‌కు అప్పగించారు. రిజర్వాయర్‌ను 20 టీఎంసీలతో నిర్మిస్తే తెలంగాణ ప్రాంతంలోని సుమారు 4,500 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని కాంట్రాక్టర్ తేల్చారు. తెలంగాణ నుంచి అభ్యంతరాలు వస్తాయనే నెపంతో జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 14 టీఎంసీలకు తగ్గించారు. అంటే.. జల్లేరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని ఎనిమిది నుంచి 14 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల 10,248 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని.. ఇందులో 6,672 ఎకరాలను అటవీ భూమిగా తేల్చారు. మిగతా 3,576 ఎకరాల భూమి ప్రైవేటు భూమిగా గుర్తించారు. ఇందులో ఇప్పటికే 2,657 ఎకరాలు సేరించారు. మరో 7,591 ఎకరాలను సేకరించాల్సి ఉంది. భూసేకరణపోను ఈ రిజర్వాయర్ పనుల నిర్మాణ వ్యయం రూ.1182 కోట్లుగా నిర్ణయించారు. తుది అంకంలోనూ కమీషన్లే.. ఎన్నికలు పూర్తయ్యాయి. మే 23న ఫలితాలు రానున్నాయి. అయినా సరే తుది అంకంలోనూ సీఎం చంద్రబాబు తన నడతను మార్చుకోవడం లేదు.. సరికదా మరింత దూకుడు పెంచారు. జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యం పెంచే పనులను తాను సూచించిన కాంట్రాక్టర్‌కే అప్పగించాలని ఎస్ఎల్ఎస్సీకి ప్రతిపాదనలు పంపేలా జలవనరులశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. కానీ నామినేషన్‌పై పనులు అప్పగించడాన్ని ఎస్ఎల్ఎస్సీ వ్యతిరేకించింది. టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తే ఖజానాకు భారీ ఎత్తున ఆదా అయ్యే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది. దాంతో ఎస్ఎల్ఎస్సీపై చిందులు తొక్కిన సీఎం చంద్రబాబు.. ఆ ప్రతిపాదనలను బీవోసీఈకి పంపాలని ఆదేశించారు. తక్షణమే బీవోసీఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. తాను సూచించిన కాంట్రాక్టర్‌కే జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు పనులను అప్పగించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నామినేషన్‌పై పనులు అప్పగించడానికి బీవోసీఈ ఆమోదముద్ర వేయడమే తరువాయి.. ఆ వెంటనే ఆ కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకోవాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఆ కాంట్రాక్టర్ నుంచి కనీసం రూ.వంద కోట్లకు పైగా కమీషన్ల రూపంలో వసూలు చేసుకోవడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
అస్మదీయ కాంట్రాక్టర్లను అడ్డుపెట్టుకుని..
సాక్షి, అమరావతి: చింతలపూడి ఎత్తిపోతల పథకం పనుల్లో ముఖ్యనేత భారీ స్కామ్‌కు తెరతీశారు. అనుకూలురైన ఇద్దరు కాంట్రాక్టర్లను అడ్డుపెట్టుకుని రూ.1,490.20 కోట్లను దోచుకోవడానికి స్కెచ్ వేశారు. అందులో భాగంగా పనులు గిట్టుబాటు కావడం లేదని, అంచనా వ్యయం పెంచాలని కోరుతూ కాంట్రాక్టర్లతో ప్రతిపాదన చేయించారు. దానికి అనుగుణంగా అంచనా వ్యయాన్ని పెంచుతూ ప్రతిపాదనలు పంపాలంటూ చింతలపూడి ఎత్తిపోతల అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. దాంతో రూ.4,909 కోట్ల నుంచి రూ. 6,400 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచుతూ ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇవి ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వాటిని ఐబీఎం (ఇంటర్నల్ బెంచ్ మార్క్)కమిటీ తోసిపుచ్చింది. తన వ్యూహానికి ఆదిలోనే గండికొట్టేందుకు యత్నించిన ఐబీఎం కమిటీపై ముఖ్యనేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దాంతో చేసేదిలేక ఆ ప్రతిపాదనలపై ఐబీఎం కమిటీ ఆమోదముద్ర వేసింది. జలవనరులు, ఆర్థిక శాఖలతో వీటిపై ఆమోదముద్ర వేయించి.. అంచనా వ్యయాన్ని పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేయించే పనిని తన కార్యాలయంలో కీలక అధికారికి ముఖ్యనేత అప్పగించారు. దీనిపై ఆయన రోజువారీ సమీక్షలు చేస్తూ.. ఎప్పటికప్పుడు ముఖ్యనేతకు సమాచారాన్ని చేరవేస్తున్నారు. వైఎస్ మంజూరు చేసిన ప్రాజెక్టు.. గోదావరి నదికి వరద వచ్చే 90 రోజుల్లో పశ్చిమగోదావరి జిల్లా రౌతులగూడెం వద్ద నుంచి రోజుకు 56 క్యూమెక్కులు (1977.64 క్యూసెక్కులు) చొప్పున 15.50 టీఎంసీలను పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు, 6.65 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1,701 కోట్ల వ్యయంతో అక్టోబర్ 24, 2008న చింతలపూడి ఎత్తిపోతలను మంజూరు చేశారు. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. రూ.1700.57 కోట్లకు ఫిబ్రవరి 27, 2009న అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తరించింది. గోదావరి నుంచి రోజుకు అదనంగా 138.52 క్యూమెక్కులు (4897 క్యూసెక్కులు) చొప్పున 90 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి... నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 2.10 లక్షలు, ఎర్రకాల్వ కింద 27 వేలు, కొవ్వాడ కాల్వ కింద 17 వేలు, తమ్మిలేరు ప్రాజెక్టు కింద 24 వేలు వెరసి 2.80 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఆ మేరకు.. చింతలపూడి ఎత్తిపోతల అంచనా వ్యయాన్ని రూ. 4,909.80 కోట్లకు పెంచుతూ సెప్టెంబర్ 3, 2016న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గడువు ముగియక ముందే.. చింతలపూడి ఎత్తిపోతల పథకం విస్తరణ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి గతేడాది మే 20న ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈపీసీ విధానంలో జారీచేసిన టెండర్ నోటిఫికేషన్లో రెండు కాంట్రాక్టు సంస్థలకు మాత్రమే ప్రవేశం కల్పించేలా నిబంధనలు పెట్టారు. రెండు సంస్థలను కుమ్మక్కయ్యేలా చేసి.. అధిక ధరల(ఎక్సెస్)కు పనులు అప్పగించారు. మూడో ప్యాకేజీ కింద రూ. 652 కోట్ల పనులను 4.40 శాతం ఎక్సెస్(రూ.681.27 కోట్లు)కు మేఘ సంస్థకు.. నాలుగో ప్యాకేజీ కింద రూ.1608 కోట్ల విలువైన పనులను 4.49 శాతం ఎక్సెస్‌కు (రూ.1678.75 కోట్లకు) నవయుగ సంస్థకు కట్టబెట్టారు. అంటే.. ఖజానాపై రూ.100.02 కోట్ల భారం ఆదిలోనే పడింది. ముందుగానే అంచనాలను భారీగా పెంచేయడం, పైగా ఎక్సెస్ ధరలకు టెండర్లు ఖరారు చేసి ముడుపుల రూపంలో రూ. 350 కోట్లకు పైగా ముఖ్యనేత వసూలు చేసుకున్నారు. టెండర్లలో లాలూచీపర్వంపై హైపవర్ కమిటీ చైర్మన్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాంతో హైపవర్ కమిటీ నుంచి ఆయనను తప్పించడం సంచలనం రేపింది. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం ఈ పనులు 18 నెలల్లోగా పూర్తిచేయాలి. గతేడాది జూలైలో సర్కార్‌తో కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్నారు. అంటే ఒప్పందం గడువు ముగియడానికి ఇంకా 5 నెలల సమయం మిగిలి ఉంది. ఈ దశలోనే కాంట్రాక్టర్లతో కలిసి ముఖ్యనేత మరో భారీ కుంభకోణానికి తెరతీశారు. మట్టి అందుబాటులో లేదనే సాకు.. చింతలపూడి ఎత్తిపోతల పథకం విస్తరణ పనుల్లో భాగంగా 106.30 కి.మీ.ల పొడవున ప్రధాన కాలువను 194.52 క్యూమెక్కుల నీరు ప్రవహించేలా విస్తరించాలి. జుర్రేరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని ఎనిమిది టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచాలి. విస్తరణ పనులకు ఈపీసీ విధానంలో నిర్వహించిన టెండర్లలో ఇదే అంశాన్ని పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఏడాది తర్వాత ముఖ్యనేతతో కుదిరిన అవగాహన మేరకు– తమకు పనులు గిట్టుబాటు కావడం లేదంటూ కాంట్రాక్టర్లు పేచీకి దిగారు. ప్రధాన కాలువ గట్లు పనులు చేయడానికి సమీపంలో మట్టి దొరకడం లేదని.. దూరం నుంచి తీసుకొస్తున్నామని, దీని వల్ల ఖర్చు పెరుగుతోందని కాంట్రాక్టర్లు ప్రతిపాదించారు. కాలువ పనుల్లో భాగంగా అండర్ టన్నెల్లు, కాజ్‌వేలు వంటి కాంక్రీట్ నిర్మాణాల్లో కూడా పనుల పరిమాణం భారీగా పెరిగిందని పేర్కొన్నారు. అందువల్ల అంచనా వ్యయాన్ని పెంచేసి– అదనపు బిల్లులు ఇవ్వకపోతే తమకు గిట్టుబాటు కాదని సర్కార్‌కు నివేదించారు. ముఖ్యనేత ఒత్తిడితో అంచనా వ్యయాన్ని రూ.4909.80 కోట్ల నుంచి రూ.6,400 కోట్లకు పెంచుతూ సర్కార్‌కు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను ఐబీఎం కమిటీకి జలవనరుల శాఖ పంపింది. ఈపీసీ మౌలిక సూత్రాలకు విరుద్ధం ఈపీసీ విధానం ప్రకారం పనుల పరిమాణం పెరిగినా తగ్గినా సర్కార్‌కు సంబంధం ఉండదు. పూర్తి బాధ్యత కాంట్రాక్టర్‌దే. కానీ, పనుల పరిమాణం పెరిగిందనే సాకు చూపి అదనపు బిల్లుల కోసం అంచనా వ్యయాన్ని పెంచాలంటూ కాంట్రాక్టర్లు చేసిన ప్రతిపాదన ఈపీసీ విధానంలోని మౌలిక సూత్రాలకే విరుద్ధమని ఐబీఎం కమిటీ స్పష్టం చేసింది. పనులు చేయలేమని అడ్డం తిరిగిన కాంట్రాక్టర్లపై 61సీ కింద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సర్కార్‌కు సిఫార్సు చేసింది. దీని ముఖ్యనేత మండిపడుతూ.. ఉచిత సలహాలు ఇవ్వడం మాని ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేయాలంటూ గద్దించారు. చేసేదిలేక ఆ ప్రతిపాదనలపై ఐబీఎం కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రతిపాదనలపై జలవనరులు, ఆర్థిక శాఖలతో ఆమోదముద్ర వేయించి.. అంచనా వ్యయం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయించే బాధ్యతను తన కార్యాలయంలో కీలక అధికారికి ముఖ్యనేత అప్పగించారు. ప్రజా సమస్యలపై రోజు వారీ సమీక్షలు చేయాల్సిన ఆ అధికారి వాటిని పక్కన పెట్టి ముఖ్యనేతకు కమీషన్లు తెచ్చి పెట్టే ప్రతిపాదనల అమలు ఎంతవరకూ వచ్చిందనే అంశంపై సమీక్షలు చేస్తున్నారు. -
అడిగితే.. అంతే!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం తమ నుంచి సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించా లని అడిగిన రైతులను ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కించింది. పరిహారం ఇవ్వకుండా కాలువ తవ్వడానికి వీల్లేదన్న అన్నదాతలు గురువారం చింతలపూడిలోని కోర్టుకు హాజరుకావా ల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భూసేకరణ ప్రక్రియ పూర్తికాకుండానే గత ఏడాది జూలైలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం రైతుల పొలాల్లోంచి కాలువ తవ్వేం దుకు అధికారులు సిద్ధమయ్యారు. తమకు సొమ్ములు చెల్లించకుండా కాలువ ఎలా తవ్వుతారంటూ అక్కడి రైతులంతా అధికారులను నిలదీశారు. భూములను సేకరించి.. పూర్తి నష్టపరిహారం చెల్లిం చాలని డిమాండ్ చేశారు. అధికారులు పట్టిం చుకోకపోవడంతో రైతులంతా కలిసి యర్రగుంటపల్లి వద్ద కాలువ తవ్వకం పనులను అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి కోపమొచ్చింది. ఆ రైతులపై డీఈతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. చింతలపూడి జెడ్పీటీసీ రాధారాణి, యర్రగుంటపల్లి సర్పంచ్ సదరబోయిన వరలక్షి్మతోపాటు పిండపర్తి ముత్తారెడ్డి, పుల్లూరి సోమశేఖరాచార్యులు, అలవాల ఖాదర్‌బాబురెడ్డి, చిట్టూరి అంజిబాబు, మావూరి సత్యనారాయణరెడ్డి, జంగా రామచంద్రారెడ్డి, గుంటక రాఘవ, చిల్లూరి వెంకట లక్ష్మణరావు, గోలి శాంతరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వారందరికీ నోటీసులు రావడంతో గురువారం చింతలపూడి కోర్టుకు హాజరయ్యారు. కేసు ఈనెల 29వ తేదీకి వాయి దా పడింది. న్యాయం చేయకపోగా.. ఏడాది క్రితం రైతులు కాలువ పనులను అడ్డుకోగా.. ఇప్పటికీ వారికి న్యాయం జరగలేదు. యర్రగుంటపల్లిలోని రైతులకు ఒక్కపైసా కూడా పరిహారం అందలేదు. పరి హారం ఇవ్వకుండా పనులు చేయాలని ప్రయత్నించడమే కాకుండా తమపై అక్రమ కేసులు బనాయించి కోర్టుకు లాగడంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబం ధించి ప్రభుత్వం ఇచ్చిన అవార్డును వ్యతిరేకిస్తూ పలువురు కోర్టులను ఆశ్రయించడం, దానిపై స్టే రావడం తెలిసిందే. భూసేకరణ మొత్తం అవినీతిమయంగా మారడం, లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడటంతో భూసేకరణ ప్రక్రియ ఎంత అడ్డగోలుగా సాగుతోందో స్పష్టమవుతోంది. రైతులపై కేసులు పెట్టడాన్ని చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాఘవేంద్రరావు తీవ్రంగా ఖండించారు. రైతులను భయపెట్టి పనులు చేయాలని ప్రభుత్వం భావిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.