సాక్షి, అమరావతి: చింతలపూడి ఎత్తిపోతల పథకం పనుల్లో ముఖ్యనేత భారీ స్కామ్‌కు తెరతీశారు. అనుకూలురైన ఇద్దరు కాంట్రాక్టర్లను అడ్డుపెట్టుకుని రూ.1,490.20 కోట్లను దోచుకోవడానికి స్కెచ్ వేశారు. అందులో భాగంగా పనులు గిట్టుబాటు కావడం లేదని, అంచనా వ్యయం పెంచాలని కోరుతూ కాంట్రాక్టర్లతో ప్రతిపాదన చేయించారు. దానికి అనుగుణంగా అంచనా వ్యయాన్ని పెంచుతూ ప్రతిపాదనలు పంపాలంటూ చింతలపూడి ఎత్తిపోతల అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. దాంతో రూ.4,909 కోట్ల నుంచి రూ. 6,400 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచుతూ ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు.
ఇవి ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వాటిని ఐబీఎం (ఇంటర్నల్ బెంచ్ మార్క్)కమిటీ తోసిపుచ్చింది. తన వ్యూహానికి ఆదిలోనే గండికొట్టేందుకు యత్నించిన ఐబీఎం కమిటీపై ముఖ్యనేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దాంతో చేసేదిలేక ఆ ప్రతిపాదనలపై ఐబీఎం కమిటీ ఆమోదముద్ర వేసింది. జలవనరులు, ఆర్థిక శాఖలతో వీటిపై ఆమోదముద్ర వేయించి.. అంచనా వ్యయాన్ని పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేయించే పనిని తన కార్యాలయంలో కీలక అధికారికి ముఖ్యనేత అప్పగించారు. దీనిపై ఆయన రోజువారీ సమీక్షలు చేస్తూ.. ఎప్పటికప్పుడు ముఖ్యనేతకు సమాచారాన్ని చేరవేస్తున్నారు.
వైఎస్ మంజూరు చేసిన ప్రాజెక్టు..
గోదావరి నదికి వరద వచ్చే 90 రోజుల్లో పశ్చిమగోదావరి జిల్లా రౌతులగూడెం వద్ద నుంచి రోజుకు 56 క్యూమెక్కులు (1977.64 క్యూసెక్కులు) చొప్పున 15.50 టీఎంసీలను పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు, 6.65 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1,701 కోట్ల వ్యయంతో అక్టోబర్ 24, 2008న చింతలపూడి ఎత్తిపోతలను మంజూరు చేశారు. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. రూ.1700.57 కోట్లకు ఫిబ్రవరి 27, 2009న అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తరించింది. గోదావరి నుంచి రోజుకు అదనంగా 138.52 క్యూమెక్కులు (4897 క్యూసెక్కులు) చొప్పున 90 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి... నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 2.10 లక్షలు, ఎర్రకాల్వ కింద 27 వేలు, కొవ్వాడ కాల్వ కింద 17 వేలు, తమ్మిలేరు ప్రాజెక్టు కింద 24 వేలు వెరసి 2.80 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఆ మేరకు.. చింతలపూడి ఎత్తిపోతల అంచనా వ్యయాన్ని రూ. 4,909.80 కోట్లకు పెంచుతూ సెప్టెంబర్ 3, 2016న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
గడువు ముగియక ముందే..
చింతలపూడి ఎత్తిపోతల పథకం విస్తరణ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి గతేడాది మే 20న ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈపీసీ విధానంలో జారీచేసిన టెండర్ నోటిఫికేషన్‌లో రెండు కాంట్రాక్టు సంస్థలకు మాత్రమే ప్రవేశం కల్పించేలా నిబంధనలు పెట్టారు. రెండు సంస్థలను కుమ్మక్కయ్యేలా చేసి.. అధిక ధరల(ఎక్సెస్)కు పనులు అప్పగించారు. మూడో ప్యాకేజీ కింద రూ. 652 కోట్ల పనులను 4.40 శాతం ఎక్సెస్(రూ.681.27 కోట్లు)కు మేఘ సంస్థకు.. నాలుగో ప్యాకేజీ కింద రూ.1608 కోట్ల విలువైన పనులను 4.49 శాతం ఎక్సెస్‌కు (రూ.1678.75 కోట్లకు) నవయుగ సంస్థకు కట్టబెట్టారు. అంటే.. ఖజానాపై రూ.100.02 కోట్ల భారం ఆదిలోనే పడింది.
ముందుగానే అంచనాలను భారీగా పెంచేయడం, పైగా ఎక్సెస్ ధరలకు టెండర్లు ఖరారు చేసి ముడుపుల రూపంలో రూ. 350 కోట్లకు పైగా ముఖ్యనేత వసూలు చేసుకున్నారు. టెండర్లలో లాలూచీపర్వంపై హైపవర్ కమిటీ చైర్మన్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాంతో హైపవర్ కమిటీ నుంచి ఆయనను తప్పించడం సంచలనం రేపింది. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం ఈ పనులు 18 నెలల్లోగా పూర్తిచేయాలి. గతేడాది జూలైలో సర్కార్‌తో కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్నారు. అంటే ఒప్పందం గడువు ముగియడానికి ఇంకా 5 నెలల సమయం మిగిలి ఉంది. ఈ దశలోనే కాంట్రాక్టర్లతో కలిసి ముఖ్యనేత మరో భారీ కుంభకోణానికి తెరతీశారు.
మట్టి అందుబాటులో లేదనే సాకు..
చింతలపూడి ఎత్తిపోతల పథకం విస్తరణ పనుల్లో భాగంగా 106.30 కి.మీ.ల పొడవున ప్రధాన కాలువను 194.52 క్యూమెక్కుల నీరు ప్రవహించేలా విస్తరించాలి. జుర్రేరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని ఎనిమిది టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచాలి. విస్తరణ పనులకు ఈపీసీ విధానంలో నిర్వహించిన టెండర్లలో ఇదే అంశాన్ని పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఏడాది తర్వాత ముఖ్యనేతతో కుదిరిన అవగాహన మేరకు– తమకు పనులు గిట్టుబాటు కావడం లేదంటూ కాంట్రాక్టర్లు పేచీకి దిగారు.
ప్రధాన కాలువ గట్లు పనులు చేయడానికి సమీపంలో మట్టి దొరకడం లేదని.. దూరం నుంచి తీసుకొస్తున్నామని, దీని వల్ల ఖర్చు పెరుగుతోందని కాంట్రాక్టర్లు ప్రతిపాదించారు. కాలువ పనుల్లో భాగంగా అండర్ టన్నెల్‌లు, కాజ్‌వేలు వంటి కాంక్రీట్ నిర్మాణాల్లో కూడా పనుల పరిమాణం భారీగా పెరిగిందని పేర్కొన్నారు. అందువల్ల అంచనా వ్యయాన్ని పెంచేసి– అదనపు బిల్లులు ఇవ్వకపోతే తమకు గిట్టుబాటు కాదని సర్కార్‌కు నివేదించారు. ముఖ్యనేత ఒత్తిడితో అంచనా వ్యయాన్ని రూ.4909.80 కోట్ల నుంచి రూ.6,400 కోట్లకు పెంచుతూ సర్కార్‌కు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను ఐబీఎం కమిటీకి జలవనరుల శాఖ పంపింది.
ఈపీసీ మౌలిక సూత్రాలకు విరుద్ధం
ఈపీసీ విధానం ప్రకారం పనుల పరిమాణం పెరిగినా తగ్గినా సర్కార్‌కు సంబంధం ఉండదు. పూర్తి బాధ్యత కాంట్రాక్టర్‌దే. కానీ, పనుల పరిమాణం పెరిగిందనే సాకు చూపి అదనపు బిల్లుల కోసం అంచనా వ్యయాన్ని పెంచాలంటూ కాంట్రాక్టర్లు చేసిన ప్రతిపాదన ఈపీసీ విధానంలోని మౌలిక సూత్రాలకే విరుద్ధమని ఐబీఎం కమిటీ స్పష్టం చేసింది. పనులు చేయలేమని అడ్డం తిరిగిన కాంట్రాక్టర్లపై 61సీ కింద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సర్కార్‌కు సిఫార్సు చేసింది. దీని ముఖ్యనేత మండిపడుతూ.. ఉచిత సలహాలు ఇవ్వడం మాని ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేయాలంటూ గద్దించారు.
చేసేదిలేక ఆ ప్రతిపాదనలపై ఐబీఎం కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రతిపాదనలపై జలవనరులు, ఆర్థిక శాఖలతో ఆమోదముద్ర వేయించి.. అంచనా వ్యయం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయించే బాధ్యతను తన కార్యాలయంలో కీలక అధికారికి ముఖ్యనేత అప్పగించారు. ప్రజా సమస్యలపై రోజు వారీ సమీక్షలు చేయాల్సిన ఆ అధికారి వాటిని పక్కన పెట్టి ముఖ్యనేతకు కమీషన్‌లు తెచ్చి పెట్టే ప్రతిపాదనల అమలు ఎంతవరకూ వచ్చిందనే అంశంపై సమీక్షలు చేస్తున్నారు.
అస్మదీయ కాంట్రాక్టర్లను అడ్డుపెట్టుకుని..
Published Tue, Jul 10 2018 2:41 AM | Last Updated on Tue, Jul 10 2018 2:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment