విలువలులేని విద్య నిరర్థకం
హైకోర్టు జడ్జి జస్టిస్ శివశంకరరావు
భవానీపురం : మానవత, విలువలు లేని విద్య, ఆత్మ ప్రబోధంలేని వృత్తి నిరర్థకమని హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకరరావు అన్నారు. గవర్నర్‌పేటలోని సివిల్ కోర్టుల ప్రాంగణంలోని బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో శనివారం రిజి స్ట్రేషన్, స్టాంపుల చట్టాలు, వీలునామా, స్థలం అమ్మకాలు-కొనుగోలు, తనఖా తదితర అంశాలపై జరిగిన సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సమాజంలోని పరిస్థితులను సరిదిద్దడానికి నూతన చట్టాలు పుట్టుకొస్తున్నాయని తెలి పారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువత పెడదారిన పడుతోందని, అది చాలా బాధాకరమని పేర్కొన్నారు.
దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, తాము ఎంచుకున్న వృత్తిలో ముందడుగు వేయాలని యువతకు పిలుపునిచ్చారు. మనిషి సమాజంలోని మంచిని మాత్రమే స్వీకరించి చెడును విడనాడాలని సూచించారు. న్యాయవాదులు నిజాయితీ, మానవత విలువలను కాపాడుతూ న్యాయస్థానాలకు సహకరించడం ద్వారా ఉత్తమ తీర్పులు వెలువడే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్‌లో జరుగబోయే లావాదేవీల గురించి వివరించారు. రిజిస్ట్రేషన్-స్టాంపుల చట్టాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
జిల్లా పూర్తి అదనపు ప్రధాన న్యాయమూర్తి ఆర్.మురళి మాట్లాడుతూ గతంలో కృష్ణాజిల్లాలో పని చేసిన శివశంకరరావు ఉన్నత శిఖరాలను చేరుకుని ఉత్తమ తీర్పులను ఇస్తున్నారని కొనియాడారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపర దుర్గాశ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు దివ్వెల పిచ్చయ్య, హేమంత్‌కుమార్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, బీబీఏ ప్రధాన కార్యదర్శి వజ్జే వెంకటరవికుమార్, ఉపాధ్యక్షులు ప్రసాద్, గోగిశెట్టి వెంకటేశ్వరరావు, పిళ్లారవి, కార్యవర్గ సభ్యులు చింతా ఉమామహేశ్వరరెడ్డి, ఎం.శ్రీనివాసరావు, ఎం.హెప్సిబా, బి.సాయిబాబు, ఎం.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.