కోల్స్ కాలేజీ గ్రౌండ్ ఆక్రమణదారులను అరెస్ట్ చేయాలి
– బాప్టిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎస్ ప్రభుదాస్ డిమాండ్
–మద్దతు తెలిపిన వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్
కల్లూరు(రూరల్): కోల్స్ కాలేజీ గ్రౌండ్ ఆక్రమణదారులను వెంటనే అరెస్ట్ చేయాలని బాప్టిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎస్ ప్రభుదాస్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కోల్స్ చర్చి ఎదురుగా బాప్టిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో క్రైస్తవులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ కోల్స్ కాలేజీ గ్రౌండ్ అక్రమ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేసి కొన్నవారిని, అమ్మిన వారిని చట్టపరంగా శిక్షించాలన్నారు.
వైఎస్ఆర్సీపీ మద్దతు..
క్రైస్తవుల రిలే నిరాహార దీక్షలకు వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు నరసింహులు యాదవ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ కోల్స్ విద్యా సంస్థల ఆస్తులను అక్రమంగా అమ్మిన వారిపై, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కోల్స్ కాలేజీ ఆస్తులను రక్షించేందుకు వైఎస్ఆర్సీపీ తరఫున ముందుండి పోరాటం చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు నరసింహులు యాదవ్ మాట్లాడుతూ ఎంతోమంది మేథావులు కోల్స్ కాలేజీలో చదువుకుని ముఖ్యమంత్రులు, మంత్రులు, డాక్టర్లు, మేథావులు అయ్యారని గుర్తు చేశారు. కోల్స్ కాలేజీ అస్తులను అమ్మడం దారుణమన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున తమ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అనంతరం క్రైస్తవులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య, ఎస్ఏ రహమాన్, జాన్ విల్సన్, ఫైరోజ్, హరికృష్ణ, బికె రాజశేఖర్, ఈశ్వర్, పేలాల రాఘవేంద్ర తదితరులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. బాప్టిస్టు క్రిష్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ ఎన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.