దుమ్మురేపిన బావగారు..
అనగనగా ఓ ఉద్యానవనం. అందులో ఒక బావ, బావమరిది. క్షణం కూడా కలిసి కుదురుగా ఉండేలని ఆ ఇద్దరికి నిత్యం తగాదానే. ఒక రోజు బావను బామ్మర్ది పిచ్చిపిచ్చిగా తిట్టడం, దానికి బావ కోపంతో రగిలిపోవడం, దాంతో బామ్మర్ది ప్రాణభయంతో దాక్కోవడం జరిగింది. సర్రున నేల బొరియలోకి పారిపోయిన ఎలుక బామ్మర్దిని కరిచేయడానికి బావపడ్డ పాట్లు ప్రపంచానికి నవ్వుతెప్పించాయి. ఆ నక్కబావ ఫొటోనే ప్రపంచ కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అవార్డుల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. అదీ కథ!
ప్రపంచం నలుమూలల్లోని ఔత్సాహిక, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోల నుంచి బాగా నవ్వు తెప్పించే ఫొటోలను ఎంపికచేసి కామెడీ అవార్డులు అందిస్తుంది ‘ది బార్న్ ఫ్రీ ఫౌండేషన్’. 2016కుగానూ మొత్తం 2,200 ఎంట్రీలు వచ్చాయి. జ్యూరీ కమిటీ వడపోత అనంతరం అమెరికాకు చెందిన డాక్టర్ ఏంజెలా బోల్కే ప్రఖ్యాత ఎల్లోస్టోన్ పార్కులో చిత్రీకరించిన నక్కబావ ఫొటోకు మొదటి బహుమతి దక్కింది. ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధులు గతవారం లండన్ లో ఫలితాలను వెల్లడించారు. ఓవరాల్ కేటగిరీలోనేకాక, ల్యాండ్ కేటగిరీలోనూ నక్కబావ ఫొటోదే పై చేయి. ఆ పోటీలకు సంబంధించి అత్యుత్తమ ఫొటోలు మీకోసం..