కులం కట్టుబాట్లకు ‘ఆ నలుగురు’ దూరం
జగిత్యాల జోన్ : కులం కట్టుబాట్లతో ‘ఆ నలుగురు’ దూరమైనా తామున్నామంటూ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ముందుకు వచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. అప్పటి వరకు కన్నీరుమున్నీరవుతున్న మృతురాలి కుటుంబ సభ్యులకు తాము అండగా ఉన్నామని భరోసానిచ్చారు. ఈ సంఘటన మండలంలోని పోరండ్లలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇవీ.. గ్రామానికి చెందిన మారుపాక బక్కవ్వ తన తాత పేరిట ఉన్న 20 గుంటలను విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం గ్రామానికి అప్పగించింది.
భూమిలో తమకు వాటా ఉందని, గ్రామానికి ఎందుకు ఇచ్చావంటూ ఆమె సామాజిక వర్గానికి చెందిన ఎనిమది మంది పంచారుుతీ పెట్టారు. దీని వల్ల సబ్స్టేషన్ నిర్మాణం ఆగిపోతుందని, గ్రామానికి అప్పగించిన భూమికి బదులు వేరే ప్రాంతంలో తాము 30 గుంటలు అప్పగిస్తామని గ్రామస్తులు ఆ ఎనిమిదిమందిని సముదాయించారు. ఈ క్రమంలోనే బక్కవ్వ అత్త రాజవ్వ ఆదివారం మృతిచెందింది.
కానీ, సోమవారం మధ్యాహ్నం వరకూ శవం వద్దకు కులస్తులెవరూ వెళ్లలేదు. శవాన్ని శ్మశానవాటిక వద్ద తీసుకెళ్లేవారే లేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యూరు. స్పందించిన గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు రాజవ్వ అంత్యక్రియలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాజవ్వతో ఎలాంటి బంధం లేకున్నా మానవతా దృక్పథంతో ఈ తంతు పూర్తి చేశారు.
పోలీసుల విచారణ..
కాగా, సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు పోరండ్లకు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. బాధ్యులైన కులస్తుల నుంచి వివరాలు సేకరించారు. మానవ సంబంధాలను కాదన్న వారిని తప్పుబట్టారు. వారికి కౌన్సెలింగ్ చేశారు. దీంతో సమస్య పరిష్కారమైంది.