Credit Information Company
-
ఎగవేత పట్టణాల్లోనే ఎక్కువ!
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లోని రుణ గ్రహీతలతో పోలిస్తే, పట్టణాల్లోని సూక్ష్మ రుణ గ్రహీతల్లో సకాలంలో చెల్లించని ధోరణి ఎక్కువగా ఉందని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ‘సీఆర్ఐఎఫ్ హై మార్క్’ తెలిపింది. మార్చి త్రైమాసికం నాటికి పట్టణాల్లోని రుణగ్రహీతల్లో 30 రోజుల వరకు బకాయిలు చెల్లించని మొత్తం 3.25 శాతంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది 2.5 శాతమే ఉందని వెల్లడించింది. ఇక తీసుకున్న రుణాలను 31 రోజుల నుంచి 180 రోజుల వరకు తీర్చకుండా బకాయి పడిన వారి శాతం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకే విధంగా ఉందని, 2018 సెప్టెంబర్ నుంచి ఒక శాతం మేర ఉన్నట్టు తెలిపింది. మొత్తం సూక్ష్మ రుణాలు రూ.1.88 లక్షల కోట్లలో గ్రామీణ ప్రాంత వాటా 54 శాతంగా ఉందని పేర్కొంది. మార్చి త్రైమాసికంలో స్థూల రుణాల పోర్ట్‌ఫోలియో 12 శాతం పెరిగిందని తెలిపింది. 2019 మార్చి నాటికి 5.6 కోట్ల యాక్టివ్ సూక్ష్మ రుణ గ్రహీతలు ఉన్నారని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 22 శాతం అధికమని వివరించింది. -
చౌక గృహాలకు రుణం... లాభం!
ముంబై: చౌక గృహాలకు (రూ.10 లక్షల లోపు) రుణాలను అందించడం బ్యాంకింగ్ రంగానికి లాభదాయకమైన అంశంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ– సిబిల్ తన నివేదికలో పేర్కొంది. ఈ విభాగంలో గడచిన ఐదేళ్లలో రుణ వృద్ధి రేటు 23 శాతంపైగా ఉందని సిబిల్ పేర్కొంది. ఈ విభాగంలో మొండిబకాయిలు ఒక శాతంగా ఉన్నాయని తెలిపింది. రుణదాతలకు హౌసింగ్ విభాగం పటిష్ట వృద్ధి అవకాశాలను కల్పిస్తోందని తన తాజా అధ్యయన పత్రంలో వివరించింది. ఈ నివేదికలో అంశాలను సిబిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్షలా చందూర్కర్ వివరించారు. ముఖ్యాంశాలు చూస్తే... 2016లో చౌర గృహ రుణ బుక్విలువ రూ.30,400 కోట్లు. రుణ గ్రహీతలు 7.5 లక్షల మంది.మొండిబకాయిల శాతం అతి తక్కువగా ఉండడం రుణదాతకు సానుకూలాంశం. ఈ విభాగంలో సగటు రుణ పరిమాణం సగటున రూ.4.8 లక్షలు ఉంటే, ఇది ఇప్పుడు దాదాపు రూ.4.1 లక్షలకు చేరింది. సగటు తక్కువగా ఉండడం వల్ల మరిన్ని చిన్న బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు రానున్న సంవత్సరాల్లో ఈ విభాగంలోకి అడుగుపెట్టొచ్చు. టాప్–5లో ఆంధ్రప్రదేశ్... చౌక గృహ రుణాలకు సంబంధించి అకౌంట్ల ప్రారంభంలో గడచిన ఐదేళ్లలో టాప్‌లో ఉన్న రాష్ట్రాల్లో– మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. ప్రారంభమైన అకౌంట్లలో 60 శాతం వాటా ఈ రాష్ట్రాలదేనని అధ్యయనం తెలిపింది. అకౌంట్ల విషయంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో (6.53 లక్షలు) ఉంది. తరువాతి స్థానంలో మధ్యప్రదేశ్ (5.60 లక్షలు), గుజరాత్ (3.13 లక్షలు), తమిళనాడు (2.65 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (2.28 లక్షలు) ఉన్నాయి. -
క్రెడిట్ కార్డ్ నిబంధనలు కఠినతరం
న్యూఢిల్లీ : క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ నిబంధనావళిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠినతరం చేసింది. పేమెంట్ బకాయి నిర్దేశిత సమయంకన్నా... మూడు రోజులు దాటితే... ఆ ఆలస్యానికి సంబంధించి క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై జరిమానా విధించాలని, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఈ సమాచారాన్ని తెలియజేయాలని బ్యాంకులను ఆదేశించింది. బకాయి ఆలస్యం ప్రాతిపదికన జరిమానాలు ఉండాలని నిర్దేశించింది. బకాయి తేదీ నుంచి 90 రోజుల లోపు ‘బకాయి కనీస మొత్తం ’ చెల్లించకపోతే... క్రెడిట్ కార్డ్‌ను ‘మొండి బకాయి పద్దు’(ఎన్పీఏ)గా పరిగణించాలని ఒక నోటిఫికేషన్లో తెలిపింది. రుణ విధానాల్లో అత్యుత్తమ క్రమశిక్షణ ప్రక్రియను పెంపొందించే క్రమంలో ఈ నిబంధనావళిని అమలు చేయాలని సూచించింది. బకాయి తేదీ నాటికి పూర్తి మొత్తాన్ని లేదా అందులో కొంత భాగాన్ని లేదా ఒక కనీస మొత్తాన్ని చెల్లించే అవకాశాన్ని కార్డ్ వినియోగదారులకు బ్యాంకులు కల్పించాలని ఆర్బీఐ సూచించింది. ఈ విధానంలో ఒక వేళ చెల్లించాల్సిన బ్యాలెన్స్ ఇంకా ఉంటే... ఆ మొత్తాన్ని తదుపరి నెల బిల్లింగ్ ప్రక్రియలో చెల్లించేలా అవకాశం కల్పించాలని పేర్కొంది.