అమ్మో.. జీఎస్టీ!
తాడేపల్లిగూడెం : ‘జీఎస్టీ ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుంది.. పన్నులు ఎలా ఉంటాయో.. డబ్బు చలామణి కుదరదంటావా.. అనామతు ఖాతాలు ఉండవటగా.. నగదు లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే చేసి తీరాలా..’ వ్యాపారుల మధ్య నిత్యం చోటుచేసుకుంటున్న సంభాషణలివి. ఇకపై చిట్టా, ఆవర్జాలు ఎలా నిర్వహించాలి, అసలు జీఎస్టీ ఎలా ఉండబోతోందనే అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. మొత్తంగా గూడ్స్, సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) అంశం వ్యాపార వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీని అమలుకు అమలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రేపోమాపో మార్గదర్శకాలు వెలువడనున్న నేపథ్యంలో వ్యాపారుల్లో గుబులు నెలకొంది. జీఎస్టీ ఆమల్లోకి వస్తే రోజుకు రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో లావాదేవీలు నిర్వహించకూడదు. అంతకుమించి లావాదేవీలు చేయాల్సి వస్తే బ్యాంక్ ఖాతాలు, ఆన్లైన్ ఆర్టీజీఎస్ ద్వారా మాత్ర మే చెల్లింపులు చేయాలి. ఇంత చేసినా మామూళ్ల బెడద తప్పుతుందా లేదా అనే మీమాంస నెలకొంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఒకటి, కేంద్ర ప్రభుత్వం అధీనంలో మరొకటి చొప్పున చెక్‌పోస్టులు ఏర్పాటవుతాయని చెబుతున్నారు. దీనివల్ల రెండుచోట్లా మామూ ళ్లు సమర్పించుకోవాల్సి వస్తుందేమోనన్న అనుమానం వెంటాడుతోంది. రూ.కోటిన్నర టర్నోవర్ ఉండే వ్యాపారాలపై రాష్ట్రం అజమాయిషీ. రూ.కోటిన్నర దాటితే కేంద్రం ఆజమాయిషీ ఉంటుందని చెబుతున్నారు.
నగదు లావాదేవీలు ఇలా..
ఆర్థిక బిల్లు–2017లో చేసిన సవరణల వల్ల వ్యాపార వర్గాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. గతంలో రోజుకు రూ.20 వేలకు మించి నగదు రూపంలో చెల్లించకూడదనే నిబంధన ఉండేది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.10 వేలకు తగ్గించారు. అంటే ఏప్రిల్ 1నుంచి అద్దెలు, జీతాలు, నగదు కొనుగోళ్లు మొదలైనవి రోజుకు రూ.10 వేలకు మించి ఖర్చు చేయకూడదు. రవాణాదారులు మాత్రం గతంలో మాదిరిగానే రోజుకు రూ.35 వేలు నగదు రూపంలో చెల్లింపులు చేయవచ్చు. గతంలో మూలధన ఖర్చు నగదు రూపంలో ఎంతైనా చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం రూ.10 వేలకు మించి చేసే మూలధన ఖర్చుకు తరుగుదల అనుమతించరు. గతంలో వ్యాపార నిమిత్తం కారు, జనరేటర్, ఏసీ మొదలైనవి నేరుగా సొమ్ము చెల్లించి కొనుగోలు చేసినా తరుగుదల అనుమతించేవారు. నూతన సవరణ ప్రకారం చెక్కు, ఎలక్ట్రానిక్ ట్రా¯Œ్సఫర్ ద్వారా చేసే చెల్లింపులను మాత్రమే తరుగుదలకు అనుమతిస్తారు. నగదు రూపంలో రూ.2 లక్షల తీసుకోవడంపై వ్యాపార వర్గాల్లో ఆందోళన ఉంది. రోజుకు ఒక వ్యక్తి నుంచి నగదురూపంలో తీసుకునే మొత్తం రూ.2 లక్షలు దాటకూడదు. ఒక లావాదేవీ విలువ రూ.2 లక్షలు దాటితే నగదు రూపంలో తీసుకోకూడదు. ఏదైనా ఒక కార్యక్రమం లేదా సందర్భం విషయంలో రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో చెల్లింపులు చేయడం కుదరదు. బ్యాంకు ఖాతాలో ఎంత సొమ్ము అయినా జమ చేయవచ్చు, తీసుకోవచ్చు. అయితే.. రూ.2 లక్షలకు మించి నగదుగా తీసుకున్న వ్యక్తి లేదా సంస్థ ఆ మొత్తంపై 100 శాతం అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
ఆందోళన వద్దు
జీఎస్టీ వసూలు విధానం, రూ.2 లక్షల నగదు లావాదేవీల విషయంలో వ్యాపారులు అపోహలు పెట్టుకోవాలి్సన అవసరం లేదు. చట్టంలో ఈ విషయాలను పూర్తిగా పొందుపర్చారు. వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మంచిది.
– ఎన్వీ రమణారావు, ఇన్‌కం ట్యాక్స్ ఆడిటర్