స్నేక్ గ్యాంగ్ వ్యవహారంలో నిర్లక్ష్యం, సీఐపై వేటు
హైదరాబాద్: రాజధాని శివార్లలో యువతిపై స్నేక్‌గ్యాగ్ లైంగికదాడికి పాల్పడిన ఘటనలో పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డిపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బదిలీ వేటు వేశారు. గతనెల 31న ఫామ్‌హౌస్‌లో ఈ ఘోరం జరిగినప్పటి నుంచీ నిందితుడు ఫైసల్ దయానీ అరెస్టయ్యే వరకు కేసు విచారణలో నిర్లక్ష్యంగా వహించినందుకు భాస్కర్‌రెడ్డిని గచ్చిబౌలిలోని పోలీసు హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కళింగరావును నియమించారు.
కాగా ఫాంహౌస్‌లో యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ గ్యాంగ్‌పై పహాడీషరీఫ్ పోలీసులు సోమవారం మరో కేసు నమోదు చేశారు. దంపతుల గొడవలో తలదూర్చిన ఫైసల్ .. మహిళ భర్తను ఖాదర్ బారక్ బా, సాలం హమ్దీలతో కలిసి కర్రతో చితకబాదాడు. ఈ విషయం పోలీసులు స్వాధీనం చేసుకున్న వీడియోలో వెల్లడైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు పై ముగ్గురిపై సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్...
మరోవైపు పలు నేరాలతో ప్రమేయమున్నట్లు భావిస్తున్న పోలీసులు.. ఫైసల్ దయానీ, సాలం హమ్దీలను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ 14వ ఎంఎం కోర్టులో నిన్న పిటిషన్ వేశారు. స్నేక్ గ్యాంగ్ పేరుతో వీరు పలువురిపై దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తోందని, దీనిపై సమగ్రంగా విచారిస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు.