అరేబియా సముద్రంలో 'అశోభ' తుపాను
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు 'అశోభ' అని పేరుపెట్టారు. తుపాను ప్రభావంతో ఒమన్ నుంచి పాకిస్థాన్ వరకు గల తీరప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. ఈ వారాంతంలో ఇది తీరాన్ని తాకుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో ఉన్న వేడి జలాలు ఈ తుపాను మరింత బలం పుంజుకుంటుందని చెబుతున్నారు.
తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, సుడిగాలులు రావచ్చని హెచ్చరిస్తున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. సూరత్, ముంబై, కొచ్చి ప్రాంతాల్లో కూడా తుపాను ప్రభావం వల్ల వాతావరణంలో తేమ పెరుగుతుందని, దీనివల్ల ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఆక్యువెదర్కు చెందిన వాతావారణ శాస్త్రవేత్త ఆడమ్ డౌటీ తెలిపారు.