రాష్ట్రంలో తుగ్లక్ పాలన
బెంగళూరు : కర్ణాటకలో తుగ్లక్ పాలన నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దళిత సీఎం’ విషయమై కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాల వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమయిందని పేర్కొన్నారు. హుబ్లీలో ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో యడ్యూరప్ప మాట్లాడారు. ‘కాంగ్రెస్లో ఒక వర్గం వారు దళిత నాయకుడు సీఎం కావాలని పట్టుబడుతున్నారు. మరో వర్గం వారు సిద్ధరామయ్యే సీఎం స్థానానికి అర్హుడు అంటున్నారు. ఇదిలా ఉండగా తన స్థానాన్ని కాపాడుకోవడానికి సిద్ధరామయ్య తాను దళితుడినే అంటూ కొత్త రాగం అందుకున్నారు.
ఇలా సీఎం కుర్చీ చుట్టే అందరి కళ్లూ ఉండటంతో పాలన ఎలా సాగుతుంది.’ అని యడ్యూరప్ప ప్రశ్నించారు. గత బడ్జెట్లో కేటాయించిన నిథులే పూర్తిగా ఖర్చు కాలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అయినా ప్రభుత్వం నూతన బడ్జెట్ను ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు శివమొగ్గ పరిస్థితే ప్రత్యక్ష ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అభివృద్ధి విషయంలో కర్ణాటక తిరోగమన దిశలో ప్రయాణిస్తుందని అన్నారు.