Dalit entrepreneurs
-
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఓటీఎస్
సాక్షి, అమరావతి: దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం మేరకు వైఎస్సార్ బడుగు వికాసం పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం తాజాగా దళిత పారిశ్రామికవేత్తలకు వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2008–2020 మధ్య ఏపీఐఐసీ ద్వారా భూములు పొంది వివిధ కారణాల వల్ల పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఓటీఎస్ పథకాన్ని అమలు చేస్తోంది. దళిత పారిశ్రామికవేత్తలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి కోరారు. గతంలో పదేళ్లపాటు భూమిని లీజుకు కేటాయించడం వల్ల రుణ మంజూరు సమస్యలు తలెత్తి చాలామంది యూనిట్లు ఏర్పాటు చేసుకోలేకపోయిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో ఆయన ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భూములను పునరుద్ధరిస్తూ జీవో నంబర్–7 విడుదల చేసినట్లు తెలిపారు. తాజా నిర్ణయంతో మరింత మేలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరింత మేలు చేసే దిశగా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పదేళ్లుగా ప్రాజెక్టులో ఎటువంటి పురోగతి లేకపోవడం, నిర్ణీత సమయంలో బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడం, ప్రభుత్వపరంగా తలెత్తిన సమస్యల పరిష్కారంలో జాప్యం, చెల్లింపులు, జరిమానాలు కట్టలేని పరిస్థితుల్లో కూరుకుపోవడం వంటి కారణాలతో పారిశ్రామికవేత్తలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్లాట్లు పొంది రిజిస్ట్రేషన్లు చేసుకోకపోయినా, నగదు చెల్లించకపోయినా, తమ ప్లాటును, నగదును వెనక్కి తీసుకున్నా, ప్లాటు రద్దయినా మార్చి 31వ తేదీలోగా జిల్లాల వారీగా ఏపీఐఐసీ కార్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు వ్యక్తిగత దరఖాస్తులను నమోదు చేసుకోవాలన్నారు. లబ్ధిదారులు ప్లాట్లు పొందిన నాటి ధరలను వర్తింపజేయడమే కాకుండా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు ఎండీ పేర్కొన్నారు. ఓటీఎస్ వర్తింపు ఇలా.. ఓటీఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తిరిగి భూములను కేటాయించి అందుకు సంబంధించిన లెటర్లు ఇస్తారు. సంబంధిత మొత్తాలను 3 నెలల్లోపు వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. 91వ రోజు నుంచి 180 (3 నెలలు దాటి 6 నెలల లోపు) రోజుల వరకూ 4 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. 181వ రోజు నుంచి రెండేళ్ల వరకూ 8 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. -
అంబేడ్కర్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటర్లు, పార్లమెంటేరియన్ల ఫోరమ్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేడ్కర్ చాంబర్ ఆఫ్ కామర్స్(డాక్) పేరుతో జాతీయ స్థాయిలో ఒక నూతన వేదిక ఏర్పాటైంది. ఢిల్లీలో మంగళవారం డాక్ ప్రారంభసభలో డాక్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి దళిత పారిశ్రామిక వేత్తలు, ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటర్లు, పార్లమెంటేరియన్ల ఫోరం సభ్యులు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేయడం ఈ చాంబర్ ఉద్దేశమని వివేక్ మీడియాకు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల అభివృద్ధికి పథకాలు అమలుచేస్తున్నా సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఉపయోగించుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ చాంబర్ ద్వారా ఔత్సాహిక దళిత పారిశ్రామిక వేత్తలకు శిక్షణ ఇచ్చి, ప్రభుత్వాలతో చర్చించి దళితుల అభివృద్ధికి కృషిచేయనున్నట్టు తెలిపారు. -
దళిత, మహిళా పారిశ్రామికవేత్తలకు ఫండింగ్
ముంబై: స్టాండప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కృషిచేస్తుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 2.5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనుందని తెలిపారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) ఆధ్వర్యంలో ఏర్పాటైన 5వ జాతీయ పారిశ్రామిక, వాణిజ్య ఎగ్జిబిషన్‌ను ముంబైలో గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి, సాధికారతకు, తద్వారా దేశ ఆర్థిక పురోగతికి తమవంతు సహకారం అందించే దిశగా డిక్కీ ప్రోత్సహిస్తున్నదని మిశ్రా పేర్కొన్నారు. చిన్న పారిశ్రామికవేత్తలకు తగినంత రుణాలు దొరకకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని మిశ్రా అభిప్రాయపడ్డారు. ఈ సవాలును అధిగమించేందుకు సూక్ష్మ, చిన్న మధ్య తరహా మంత్రిత్వ శాఖ ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందన్నారు. స్టాండప్ ఇండియాలో భాగంగా దేశంలోని 1.25 లక్షల బ్యాంకింగ్ శాఖలు ఎస్సీ లేదా ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు నిధులను అందించనున్నాయన్నారు. అలాగే ఆవిష్కరణలకు నిలయమయ్యే స్టార్టప్‌లకు ప్రత్యేక మద్దతు ఇవ్వనున్నట్లు, అందులో భాగంగా ప్రభుత్వం నుంచి నిధులను అందించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ).. గ్రామీణ, పట్టణప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెంచేందుకు వీలుగా చేపట్టిన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్‌లను ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారీ పరిశ్రమల శాఖా మంత్రి అనంత్ గీతే మాట్లాడుతూ.. దళిత పారిశ్రామికవేత్తలకు సైతం మంచి భవిష్యత్ ఉండనుందన్నారు. దేశంలోని 292 ప్రభుత్వ రంగ సంస్థలు.. ఇకపై తమకు అవసరమైన వస్తువుల్లో 20 శాతం సూక్ష్మ, చిన్నమధ్య తరహా పరిశ్రమల నుంచే సేకరించడం తప్పనిసరి చేసినట్లు చెప్పారు. ఇందులో 4 శాతం దళిత పారిశ్రామికవేత్తలకు చెందిన సంస్థల నుంచి సేకరించాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్రేడ్ ఫెయిర్ ప్రారంభించారు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సాధికారత అవసరాన్ని నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన 30 స్టాళ్లు సహా 350 స్టాల్స్ ఈ ట్రేడ్ లో పాల్గొంటున్నాయి. -
దళిత పారిశ్రామికవేత్తలకు రూ. 5 కోట్లు మార్జిన్ మనీ
డిక్కి పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుం దని సీఎం కేసీఆర్ చెప్పారు. ఔత్సాహిక దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి రూ. 5 కోట్ల వరకు మార్జిన్ మనీగా ఇవ్వాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ (డిక్కి) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరుగనున్న పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భం గా ప్రసంగిస్తూ దళితులు ఉద్యోగాలు కావాలనుకొనేవాళ్లుగా కాకుండా ఇచ్చేవాళ్లుగా ఎదగడం అభినందనీయమని అన్నారు. ఔత్సాహిక దళిత పారిశ్రామికవేత్తలకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా... ప్రభుత్వమే రూ. 5 కోట్ల వరకు మార్జిన్ మనీగా ఇవ్వాలని నిర్ణయించి నట్లు తెలిపారు. దళిత యువతకు శిక్షణ ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ఎకరా స్థలంలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్మిం చేందుకు రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కాంట్రాక్టర్లుగా దళితులకు అవకాశం కల్పించి ప్రభుత్వ నిర్మాణ పనులు అప్పగిస్తామని, ఎన్ఐసీ ద్వారా శిక్షణ ఇప్పించి 200 మంది కాంట్రాక్టర్లను తయారు చేస్తామని చెప్పారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చే దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సేకరించిన భూమిలో 22 శాతం కేటాయిస్తామన్నారు. సీఐఐతో సమానంగా డిక్కిని అధికారికంగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. నాలుగు శాతం వారి నుంచే.. కేంద్రం చేసే కొనుగోళ్లలో 20 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నుంచే ఉండాలని 2012లో కేంద్రం నిర్ణయం తీసుకుందని... అందులో 4 శాతం ఉత్పత్తులను ఏప్రిల్ 1 నుంచి దళిత పారిశ్రామికవేత్తల నుంచే సేకరిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వెల్లడించారు. దళితులు రుణాల కోసం వెళ్లినప్పుడు ఎదురవుతున్న కొల్లేటరల్ సెక్యూరిటీ సమస్యను అధిగమించేందుకు ఆర్థిక మంత్రితో చర్చిస్తానన్నారు. ఈ సందర్భంగా డిక్కి వెబ్‌పోర్టల్‌ను నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న తీరు దేశంలోనే ఆదర్శవంతమైనదని డిక్కి దక్షిణ భారత శాఖ అధ్యక్షుడు నర్రా రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, చందూలాల్, ఎమ్మెల్యే జి.బాలరాజు, మహా రాష్ట్ర మంత్రి రాజ్‌కుమార్, గోద్రెజ్ సంస్థ చైర్మన్ ఆది గోద్రెజ్, సీఐఐ రాష్ట్ర చాప్టర్ సీఈవో వనిత దాట్ల, డిక్కి జాతీయ వ్యవస్థాపకులు మిలింద్ కాంబ్లే, చంద్రభాను ప్రసాద్, బొంబా యి స్టాక్ ఎక్స్ఛేంజ్ సీఈవో ఆశీష్ చౌహాన్, ఎన్ఎస్ఐసీ చైర్మన్ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.