దళిత పారిశ్రామికవేత్తలకు రూ. 5 కోట్లు మార్జిన్ మనీ
- డిక్కి పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుం దని సీఎం కేసీఆర్ చెప్పారు. ఔత్సాహిక దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి రూ. 5 కోట్ల వరకు మార్జిన్ మనీగా ఇవ్వాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ (డిక్కి) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరుగనున్న పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భం గా ప్రసంగిస్తూ దళితులు ఉద్యోగాలు కావాలనుకొనేవాళ్లుగా కాకుండా ఇచ్చేవాళ్లుగా ఎదగడం అభినందనీయమని అన్నారు.
ఔత్సాహిక దళిత పారిశ్రామికవేత్తలకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా... ప్రభుత్వమే రూ. 5 కోట్ల వరకు మార్జిన్ మనీగా ఇవ్వాలని నిర్ణయించి నట్లు తెలిపారు. దళిత యువతకు శిక్షణ ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ఎకరా స్థలంలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్మిం చేందుకు రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
కాంట్రాక్టర్లుగా దళితులకు అవకాశం కల్పించి ప్రభుత్వ నిర్మాణ పనులు అప్పగిస్తామని, ఎన్‌ఐసీ ద్వారా శిక్షణ ఇప్పించి 200 మంది కాంట్రాక్టర్లను తయారు చేస్తామని చెప్పారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చే దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సేకరించిన భూమిలో 22 శాతం కేటాయిస్తామన్నారు. సీఐఐతో సమానంగా డిక్కిని అధికారికంగా గుర్తిస్తున్నట్లు తెలిపారు.
నాలుగు శాతం వారి నుంచే..
కేంద్రం చేసే కొనుగోళ్లలో 20 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నుంచే ఉండాలని 2012లో కేంద్రం నిర్ణయం తీసుకుందని... అందులో 4 శాతం ఉత్పత్తులను ఏప్రిల్ 1 నుంచి దళిత పారిశ్రామికవేత్తల నుంచే సేకరిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వెల్లడించారు. దళితులు రుణాల కోసం వెళ్లినప్పుడు ఎదురవుతున్న కొల్లేటరల్ సెక్యూరిటీ సమస్యను అధిగమించేందుకు ఆర్థిక మంత్రితో చర్చిస్తానన్నారు.
ఈ సందర్భంగా డిక్కి వెబ్‌పోర్టల్‌ను నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న తీరు దేశంలోనే ఆదర్శవంతమైనదని డిక్కి దక్షిణ భారత శాఖ అధ్యక్షుడు నర్రా రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, చందూలాల్, ఎమ్మెల్యే జి.బాలరాజు, మహా రాష్ట్ర మంత్రి రాజ్‌కుమార్, గోద్రెజ్ సంస్థ చైర్మన్ ఆది గోద్రెజ్, సీఐఐ రాష్ట్ర చాప్టర్ సీఈవో వనిత దాట్ల, డిక్కి జాతీయ వ్యవస్థాపకులు మిలింద్ కాంబ్లే, చంద్రభాను ప్రసాద్, బొంబా యి స్టాక్ ఎక్స్ఛేంజ్ సీఈవో ఆశీష్ చౌహాన్, ఎన్‌ఎస్‌ఐసీ చైర్మన్ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.